వైసీపీ కంటే నాలుగు రెట్లు అధికంగా సీఎంఆర్‌ఎఫ్ సాయం
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 14నెలల్లో వైసీపీ కంటే 4రెట్లు అధికంగా సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించామని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా అయిదేళ్లలో ఇచ్చిన మొత్తాన్ని తొలి ఏడాదిలో అధిగమించామని, అడిగిన వారికి లేదనకుండా సీఎం చంద్రబాబు ఆపన్నహస్తం అందిస్తున్నారని అన్నారు. డబ్బులేని కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దన్నదే సీఎం సదాశయమని, అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. నియోజకవర్గంలో1036 మందికి రూ.7.18 కోట్ల సాయం అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా ఆదివారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ఆయన 204 మంది లబ్ధిదారులకు కోటి 20 లక్షల 68 వేల 518 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో వెయ్యిమంది దరఖాస్తు చేసుకుంటే 10 మందికి ఇచ్చేవారని, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతినెలా వందలు, వేలమందికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థికసాయం చేస్తున్నారన్నారని అందరికీ సాయం లభిస్తోందన్నారు. ఇవే కాక దేశంలోనే ఆదర్శంగా నిలిచిపోయేలా రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా తెస్తున్నారని, ఇకపై ఖరీదైన వైద్య సేవలకు కూడా ఎవరు భయపడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఒక కుటుంబానికి అవసరమయ్యే దాదాపు అన్ని రకాల వైద్యసేవలు ఇకపై ఉచితంగా లభిస్తాయన్నారు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పారు. వైసీపీ పాలనలో ఐదు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్‌గా అమలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో దోపిడీ యజ్ఞం చేశారని, నాసిరకం మద్యంతో 32 వేలమంది ప్రాణాలు తీశారని, 30 లక్షలమంది లివర్, కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ మళ్లీ రాదు… అమరావతి ఆగదు:
ఇదే సందర్భంగా మళ్లీ అధికారంలో వస్తామంటూ జగన్, సజ్జల, వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా చురకలు వేశారు చీఫ్ విప్ జీవీ. నాడు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడారని, ఇప్పుడు మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మంగళగిరి నుంచే పరిపాలన చేస్తామని మాట్లాడుతున్నారని కానీ రాష్ట్రంలో వైకాపా ముగి సిన శకమని గుర్తించాలన్నారు. పదేళ్లు కాదు 20, 30 ఏళ్లు అయినా వైసీపీ అధికారంలోకి వచ్చేది .. అమరావతి ఆగేది లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్న జీవీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు 60 వేల కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టుతో పాటు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
5 ఏళ్లలో వినుకొండ ఒక్క రూపాయి ఇవ్వలేదు:
ఈ సందర్భంగానే ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి వినుకొండ నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఒక్క పనిని కూడా ముందుకు తీసుకుని వెళ్లలేదని మండిపడ్డారు చీఫ్‌విప్ జీవీ. కేవలం మాయమాటలు చెప్పారని, తప్పుడు వాగ్దానాలు చేశారని, వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చేయలేకపోయారని, వినుకొండ వచ్చినప్పుడు బొల్లాపల్లి మండలానికి మంచినీటి సరఫరా కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తామని చెప్పిన జగన్ 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పల్నాడు సీమ అభివృద్ధి చెందాలని వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.(Story : వైసీపీ కంటే నాలుగు రెట్లు అధికంగా సీఎంఆర్‌ఎఫ్ సాయం )

