పవన్ జన్మదిన వేడుకల్లో జీవీ, మక్కెన
పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి మొక్కలు నాటిన జీవీ, మక్కెన, జనసేన నాయకులు
న్యూస్ తెలుగు / వినుకొండ : అసమాన పోరాటశీలి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాలతో అనుక్షణం ప్రజలకోసమే ఆలోచించే మంచి మనసున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో జనసేన నాయకులతో కలిసి జీవీ ఆంజనేయులు మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ జీవి మాట్లాడుతూ. పవన్ లాంటి గొప్ప ఆశయాలున్న వ్యక్తికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడన్నారు. రాష్ట్రం బావుండాలి, అభివృద్ధిలో ముందుకెళ్లాలనే ఒకేఒక్క ఆకాంక్షతో నాటి వైకాపా దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచారని, అక్రమ కేసులతో చంద్ర బాబుని జైల్లో పెట్టినప్పుడు కూడా పొత్తుతో ప్రకటన, అద్భుత పోరాటం చేశారన్నారు. తలసేమి యావ్యాధి బాధితుల కోసం నారా భువనేశ్వరి ఓ కార్యక్రమం తలపెడితే, రూ.50లక్షలు విరాళంగా అందించి మానవత్వం చాటుకున్నారని, అలానే ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ రాష్ట్రానికి ఎన్డీయేనే రక్షగా, దిక్సూచీగా తలచి సీఎం చంద్రబాబుకి కుడిభుజంగా పని చేస్తున్నారన్నారు. పల్లెపండుగ పేరు మీద పంచాయతీరాజ్ మంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూ ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చారని, ప్రజలు, రాష్ట్ర భవిష్యత్ కోసం అంకితభావంతో ఎన్డీయే కూటమి లక్ష్యాలు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు . జిడిసిసిబి ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. పవన్ కల్యాణ్ అంటేనే ప్రశ్నించే తత్వమని, రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన నిలబడ్డారని చెప్పారు. రాజధాని రైతులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే ప్రభుత్వాలు ఏమైనా సరే ప్రశ్నించేవారని తెలిపారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతున్నప్పుడు బయటకు వచ్చి అనేకపోరాటాలతో అది ప్రజాస్వామ్య పాలనా? లేక రాక్షస పాలనా? అంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తులో రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే మంచి ఆశయంతో కష్టకాలంలో అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గంధం కోటేశ్వరరావు, కే నాగ శ్రీను, పీవీ సురేష్ బాబు, నక్క రమణారావు, తదితరులు పాల్గొన్నారు. (Story:పవన్ జన్మదిన వేడుకల్లో జీవీ, మక్కెన)

