ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : అర్హత ఉండి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం దరాఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. నియోజకవర్గం మొత్తంలో ఎవరు ఇంటి స్థలాలు, కార్డులు కావాలన్నా వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలకే వెళ్లి నేరుగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలామంది ఉన్నారని వారికి సెంటు సరిపోదని కనీసం 3 సెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుందని, రానున్న రెండేళ్లలో ఇళ్ల స్థలాలు అర్హులకు విడతలవారీగా ప్రభుత్వం ఇవ్వని ఉందని దీనిలో భాగంగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం కొంత మందికి చొప్పున స్థలాలు ఇస్తూ వెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇళ్లస్థలాలు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాల యాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా అనేక గ్రామాలకు వెళ్తున్న క్రమంలో కొంతమంది రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని, గత ప్రభుత్వంలో అలా రేషన్ కార్డులు పొందలేక పోయిన వారంతా కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అర్హత ఉన్న వాళ్లందరికీ కొత్త రేషన్ కార్డులు, తర్వాత కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (sTORY:ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు)

