అధికారంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డికి రైతులు ఎందుకు గుర్తురాలేదు..?
ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : అధికారంలో ఉన్న అయిదేళ్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పొరపాటున కూడా రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు, వారి కష్టనష్టాలు ఎందుకు పట్టలేదని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. రూ. 1674 ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినప్పుడు గాని, మిర్చి, పొగాకు రైతులు గిట్టుబాటు ధరల్లేక అవస్థలు పడినప్పుడు గానీ జాడలేని, పంటల బీమా పథకం అమలు చేయని వ్యక్తి ఇప్పుడు రైతుల పేరుతో మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని మండి పడ్డారు. ఇదే వ్యక్తి అయిదేళ్లలో ఎప్పుడైనా రైతుల్ని ఆదుకున్నారా అని తూర్పారాబట్టారు. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరులో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఎద్దులను పూజించి నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80% తొలిఏడాది లోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు. పెరిగిన పింఛన్లు, అమల్లోకి రాను న్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలే అందుకు నిదర్శన మని తెలిపారు. దీపం-2 కింద ఏడాదికి 3 ఉచితగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. గత తెదేపా హయాంలో రాయితీ పై పెద్దఎత్తున వ్యవసాయ పరికరాలు ఇచ్చామని, వాటిని కూడా ఐదేళ్లు ఎందుకు ఎగ్గొట్టారో సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వెన్ను పోటు దినమని మాట్లాడటానికి సిగ్గుండాలని, నిజానికి అతడే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శా తం ఎగ్గొట్టి రైతులు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అందుకే 94% స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించారన్నారు. ప్రస్తుతం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేయాలనే మహా సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని, అది పూర్తయితే పల్నాడుకే తొలిలబ్ది కలుగుతుందని, ఒక సీజన్ గోదావరి , మరో సీజన్ కృష్ణా జలాలతో 2పంటలు పండించుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలో ఆయకట్టు పెరుగుతుందన్నారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రూ.12,903 కోట్లు కేటాయించిందన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. 6 లక్షలమందికి భూసార పరీక్షలు చేసి కార్డులు అందిస్తున్నామని, వైసీపీ పాలనలో ఎప్పుడైనా భూసార పరీక్షలు చేశారా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో 67 వేలమందికి కౌలు రైతు కార్డులు అందించబోతున్నామని తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ భూమిని, సాగును, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:అధికారంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డికి రైతులు ఎందుకు గుర్తురాలేదు..?)