కూనంనేని పై అనర్హత పిటిషన్ కొట్టివేత
నిజాయితీ గెలిచింది. సిపిఐ హర్షం.. అభినందన
న్యూస్ తెలుగు/వనపర్తి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే అఫిడవిటి పై నందులాల్ అగర్వాల్ వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేతపై సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేశ్, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టులో విజయం సాధించిన సాంబశివరావుకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పిటిషన్ కొట్టివేత సందర్భంగా వనపర్తి ఆఫీసులో అభినందన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారని, బయ్యారం గనుల అవినీతిపై అలుపెరుగని పోరాటం సాగించిన మచ్చలేని నేత సాంబశివరావు అన్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్ తప్పని, ఎమ్మెల్యే ఎన్నిక కొట్టివేయాలని నందులాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేయటం సూర్యుని మీద బురద వేయటం వంటిదన్నారు. ఆయన ఎప్పటికీ తప్పు చేయరని ఎన్నికల పిటిషన్ కొట్టివేత ద్వారా మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున చట్టసభలో ఏకైక ప్రతినిధిగా పీడిత తాడిత ప్రజల గొంతుకగా ఆయన పని చేస్తున్నారన్నారు. ఇది సహించని ధనస్వామ్య వర్గాలు కుట్రపూరితంగా కూనమనేని పై కేసు వేయించాయని, కోర్టు తీర్పు వారికి చెంపపెట్టు అన్నారు. వారి కుట్రలు బద్దలు అయ్యాయన్నారు. నందులాల్ అగర్వాల్ బే షరతుగా సాంబశివరావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా ఉప కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ సీనియర్ నేత పృథ్వినాథం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, వనపర్తి డివిజన్ కార్యదర్శి వంశీ, పట్టణ మహిళా సమాఖ్య కో కన్వీనర్ శిరీష, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.(Story : కూనంనేని పై అనర్హత పిటిషన్ కొట్టివేత )