సాలూరులో విద్యుత్ ఉద్యమం
నిరసన జ్వాలలతో అట్టుడికిన పట్టణం
4 రోజులుగా అంధకారంలో సాలూరు ప్రజలు
న్యూస్ తెలుగు/సాలూరు: సాలూరు పట్టణ ప్రజలు వరుసగా నాల్గవ రోజూ నరకాన్ని అనుభవించారు. విద్యుత్ సరఫరా లేక పట్టణం మొత్తం అంధకారంలో జీవనం కొనసాగిస్తున్నది. దీంతో ప్రజలు ఆగ్రహావేశాలతో నిరసనలు తెలియజేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా నాల్గవ రోజు గురువారంనాడు సాలూరులోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఆందోళనలు కొనసాగాయి. ప్రజలు రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలియజేశారు. శ్యామలంబ అమ్మవారి పండగ ఉన్నప్పటికీ, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలను చీకట్లోకి నెట్టేసిన విషయం తెల్సిందే. పట్టణంలోని గోడగల వీధి, మంజుల పేట, యాత వీధి, శ్యామలాంబ టెంపుల్ వీధి, అఖ్యాన వీధి, బోను వీధి తదితర వీధులు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. ఆగ్రహించిన ప్రజలు సాలూరు మెయిన్ రోడ్‌లో గల బోసు బొమ్మ జంక్షన్ వద్ద రోడ్డుపై టైర్లు కాలుస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులు కరెంటు పోవడం చాలా బాధాకరమని అన్నారు. విద్యుత్ అధికారులు నాలుగు రోజులుగా కరెంటు పునరుద్ధరణ చేయకపోవడం వారి అలసత్వానికి నిదర్శనమన్నారు. ఇదే కొనసాగితే, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (Story: సాలూరులో విద్యుత్ ఉద్యమం)