త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
స్థానిక రజక కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు జీవీ, మక్కెన శంకుస్థాపన
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో శుద్ధమైన నీరు పరిశుభ్రమైన కుళాయి ద్వారా స్వచ్చమైన తాగునీరు, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజి వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా పథకం ద్వారా రూ.19.89 లక్షలతో 250 ఇళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్ లైన్ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పైప్ లైన్ ఏర్పాటుతో కాలనీవాసులకు తాగునీటి ఇబ్బందులు దూరమవుతాయని తెలిపారు. ఇప్పటికే అమృత్ పథకంలో కాలనీలకు నీటి సరఫరా మెరుగుపరచడానికి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. మక్కెన మల్లికార్జునరావు సహకారంతో ఈ రజక కాలనీ ఏర్పాటైందని, దీన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చి సురక్షిత మంచినీరు సరఫరా చేస్తామన్నారు. త్వరలో అంతర్గత రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కాలనీ ఏర్పాటు చేశామని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జీవీ ఆంజనేయులు కూడా ఈ కాలనీ ఏర్పాటుకు పూర్తిగా సహకరించారని, ఎంతోమంది ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాలని చూసినా మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని ప్రోత్సహించిన
ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని మక్కెన మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు . (Story:త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం)

