పాలకుల వైఫల్యంతో
యువశక్తి నిర్వీర్యం: ఏఐవైఎఫ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశం, రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో విలువైన యువశక్తి నిర్వీర్యం అవుతోందని ఏఐవైఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం జరిపారు. రమేష్ ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఇంచార్జ్ రమేష్ తో పాటు జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, ఎండి కుతుబ్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా యువకులు ఉన్నా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయటంలో పాలకులు విఫలమయ్యారన్నారు. బిజెపి అధికారంలోకొచ్చి 11 ఏళ్లు అయిందన్నారు. తొలిసారి అధికారం లోకి రావడానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ ఆశ చూపి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. స్వయం ఉపాధికి యువత సిద్ధంగా ఉన్న,యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకు రుణాలను ఇప్పించడం లేదన్నారు. ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారన్నారు.ఈ వైపల్యం నుంచి యువత దృష్టిని మళ్లించేందుకు బిజెపి మతం, దేశభక్తి ముసుగులో రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా54 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని సుమారు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఏఐవైఎఫ్ యువతకు ఉద్యోగం ఉపాధి కోసం పోరాడుతోందని,మతం, మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించేందుకునిరంతరం కృషి చేస్తుందన్నారు. యువత ఏఐవైఎఫ్ లో చేరి హక్కుల కోసం పోరాడాలన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, ప్రధాన కార్యదర్శి కుతుబ్, నేతలు మహబూబ్, శ్రీకాంత్, చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story:పాలకుల వైఫల్యంతో యువశక్తి నిర్వీర్యం: ఏఐవైఎఫ్)