ఈ-వ్యర్థాల కాలుష్యంతో ముందుతరాల భవిష్యత్తుకే తీరని చేటు
వినుకొండలో స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న జీవీ, లావు, జూలకంటి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గుట్టలుగా పేరుకుని పోతున్న ఈ వ్యర్థాలతో భవిష్యత్ తరాలకు తీరని చేటని, సమర్థ నిర్వహణ పరిష్కారమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనే యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, పరిసరాలను కూడా అలానే చూసుకున్నప్పుడు, ఈ- వ్యర్థాలపై అవగాహనతో మెలిగినప్పుడే ముప్పు తప్పించుకోగలమన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్‌లో ఎంపీలావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ-వేస్ట్ కలెక్షన్ సెంటర్‌ను ఎంపీ లావు, చీఫ్‌విప్ జీవీ ప్రారంభించారు. అధ్యాపకులు, విద్యార్థులు, కూటమినేతలతో కలిసి పరిసరాలలో చెత్త శుభ్రం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రీ సైకిల్, రీప్రాసెస్, రీ యూజ్ విధానం, డస్ట్ బిన్స్ వాడకం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ లావు ప్రతి ఇంట్లో ఈ-వేస్ట్‌ను సమర్థంగా నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 80లక్షల టన్నుల వరకు సాధారణ వ్యర్థాలు పేరుకుపోయాయని, వాటికి ఈ-వ్యర్థాల ను కలిస్తే సమస్య తీవ్రం అవుతుందన్నారు. వ్యర్థాల కారణంగా కొన్నిప్రాంతాల్లో మనుషులు నివసించలేని దుస్థితి ఇప్పటికే చూస్తున్నామని, భవిష్యత్ అలా కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నట్లే ఈ వ్యర్థాలనూ జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలన్నారు. చీఫ్‌విప్ జీవీ మాట్లాడుతూ ఆరోగ్యం బావుండాలంటే ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దిల్లీ లాంటి ప్రాంతాల్లో కాలుష్యంతో ఊపిరితిత్తులు సహా అనేక అనారోగ్యాలు వస్తున్నాయని, మరణాలు సంభవిస్తున్నాయని, క్యాన్సర్లు ప్రబలుతున్నాయన్నారు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టినట్లు 2047కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో స్వచ్ఛాంధ్ర కీలక భూమిక పోషించనుందన్నారు. ట్యూబ్ లైట్లు, మొబైల్ ఫోన్లు, వైర్లు, పాతటీవీ లు, బ్యాటరీలు అనేకరూపాలైన ఈ-వ్యర్థాలను మున్సిపల్ సేకరణ కేంద్రాల్లోనే ఇవ్వాలని కోరారు. స్వచ్ఛత, ఈ వ్యర్థాల నిర్వహణ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులతోనే కాక… ప్రజలూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతివార్డు, ప్రతివాడలో ఈ-వ్యర్థాలపై అవగాహన కల్పించాలని, స్వచ్ఛాంధ్రలో వినుకొండపట్టణాన్ని ముందు నిలపాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ పరిశుభ్రత ప్రాధాన్యతను పిల్లలకు విద్యార్థి దశ నుంచే తెలియజేయాలన్నారు. స్వచ్ఛ దివస్ ఒక సామాజిక కార్యక్రమం అని.. ప్రభుత్వాలు ఒక్కటే ఈ పని చేయలేవన్నారు. ఇంట్లోని వ్యర్థాలు వేరు చేసి ఇవ్వాలని, ఇంట్లో చెత్తను కాల్వల్లో వేయకూడదని సూచించారు. ఈ-వేస్ట్‌ను సమర్థందా రీ సైకిల్ చేసుకుంటే సంపద సృష్టికి కూడా అవకాశం ఉంటుందని, అలాకాదని ఎక్కడబడితే అక్కడ పడే సి అనర్థాలను కొనితెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.కె.ఇస్మాయిల్, విద్యాశాఖ అధికారి జఫరుల్లా, తదితరులు పాల్గొన్నారు. (Story: ఈ-వ్యర్థాల కాలుష్యంతో ముందుతరాల భవిష్యత్తుకే తీరని చేటు)

