బాబూ జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల తో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు , సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అణగారిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ కులాల సమస్యలపై చర్చించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల పేరుతో భవనాల ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా వనపర్తి లో నిర్మించిన టౌన్ హాల్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత తొలి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించారని చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశించిన విధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత సంస్కరణతో, మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కేవలం చదువు ద్వారానే సమన్నత స్థాయికి ఎదగగలమని పేర్కొన్నారు. యువతకు ప్రస్తుతం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం, స్టాండప్ ఇండియా, టీ ప్రైడ్ వంటి పథకాలతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా త్వరలోనే జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఎస్పీ గిరిధర్ రావుల మాట్లాడుతూ సమాజంలో సమున్నత స్థాయికి ఎదగడమే మన లక్ష్యం ఉండాలని, అది మనం వ్యక్తిగతంగా మంచి ఆలోచనలతో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పారు. వ్యక్తిగత సంస్కరణతోనే సంఘసంస్కరణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చేదించే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంలో అందరూ సోదరుల లాగా కలిసిమెలిసి పనిచేసి సమాజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. పోలీసు శాఖకు జిల్లా కలెక్టర్, వనపర్తి ఎమ్మెల్యే నుంచి మంచి సహకారం లభిస్తుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాల సంరక్షణకు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో అంటరానితనం, అణగారిన వర్గాల పట్ల వివక్షతను పారద్రోలేందుకు జిల్లా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో కలెక్టర్ సహకారంతో సాయుధ దల పోలీసు కార్యాలయాన్ని శుక్రవారం డిజిపి డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.
డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూభారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నాయకులు గంధం ఘట్టన్న, భోజరాజు, గంధం నాగరాజు, కోళ్ల వెంకటేష్, మేషక్, మీసాల రాము తదితరులు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషిని, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రాజకీయాలలో ఆయన పాత్రను తెలియజేశారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని కోరారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులు, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ పాడిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. (Story : బాబూ జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం)