అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు
ప్రతి ఒక్కరూ శ్రీ పొట్టి శ్రీరాములు బాటలో నడవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
న్యూస్‌తెలుగు/అనంతపురం : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. పొట్టి శ్రీరాములు కృషి తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం, కర్నూలు రాజధానిగా పెట్టడం, ఆయన పేరున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం, విద్యాసంస్థలు, రోడ్లు, భవనాలు, వీధులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి జిల్లాలోనూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఉంటూ తెలుగు రాష్ట్రం ఆయన చేసినటువంటి కృషిని గుర్తించిందన్నారు. పొట్టి శ్రీరాములు కృషి వల్లనే రాష్ట్రం ఏర్పడిందని, ఆయన వల్లనే మేము ఇక్కడ ఉన్నామన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన ఆలోచన, మార్గదర్శకంలో, చూపించిన బాటలో నడిచిన మహాత్ముడు శ్రీ పొట్టి శ్రీరాములు అని, ఆయనని మహాత్మా శ్రీ పొట్టి శ్రీరాములు అని పిలవాలని ఉందన్నారు. ప్రజల కోసం దేశానికి లేదా రాష్ట్రానికి, తెలుగు భాష వారి కోసం ప్రాణాలను పోగొట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు అని, నెల్లూరు జిల్లాలో పనిచేసేటప్పుడు మనసులో ఆయనని మహాత్ముడిగా భావించానన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుందని, వారికి ప్రభుత్వ పథకాలు అందించవచ్చని ఎంతో చిత్తశుద్ధి ఆలోచించి దానికి కృషి చేశారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన కృషిని గుర్తించి ఆయన బాటలో నడవాలని, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయగలుగుతామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రాన్ని, జిల్లాని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ ఏ.మాలోల, డిపిఎం ఆనంద్, జిల్లా పర్యటక శాఖ అధికారి జయకుమార్ బాబు, డ్వామా పిడి సలీమ్ భాష, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్కియాలజి ఎడి రజిత, పర్యాటక శాఖ సిబ్బంది దీపక్, ఇంటాక్ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వై.సూర్యనారాయణ రెడ్డి, ఏపీ నాయి బ్రాహ్మణ సంఘం చైర్మన్ ఆదినారాయణ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్, జనసేన నాయకుడు ఈశ్వర్, వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తలారి కులాయప్ప, తదితరులు పాల్గొన్నారు.(Story : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు)