కరాటే యువ క్రీడాకారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస
చంద్రబాబుకు పరిచయం చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వినుకొండ సమీపంలోని పెదకంచర్ల గ్రామానికి చెందిన యువక్రీడాకారుడు రామినేని రోహన్‌ను ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ 11వ కరాటే ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న రోహన్‌కు ఏనుగు ప్రతిమ అందించి అభినందించారు. సీఎం చంద్రబాబు గురువారం ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారిని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. కొంతకాలంగా కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరస విజయాలతో సత్తా చాటుతున్నాడు. 15 ఏళ్ల యువ క్రీడాకారుడు రామినేని రోహన్ ఆ క్రమంలోనే 2024 నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు డర్బన్ లో జరిగిన కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో తొలి అంతర్జాతీయ పతకం సాధించాడు. 63 కిలోల విభాగంలో అతడు స్వర్ణం గెలిచి విశ్వవేదికపై త్రివర్ణ పతాకను రెపరెపలాడించాడు. ఎలైట్ విభాగంలో స్వర్ణంతో పాటు క్లబ్స్ విభాగంలో కాంస్యం అందుకున్నాడు. అంతకు ముందు జాతీయ, జోనల్ స్థాయిలో పలు పతకాలు గెలుచుకుని కరాటేలో ప్రతిభ చూపాడు. రోహన్ వెంట ఆయన తండ్రి రామినేని శివకృష్ణ, తాత రామినేని రామకోటయ్య, పెదనాన్నలు రామినేని పూర్ణచంద్రరావు, రామినేని సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రోహన్ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి, వినుకొండకు మరింత మంచిపేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన నూతన క్రీడా విధానంతో ఇలాంటి వర్థమాన, గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఒకవైపు క్రీడా మౌలిక వసతుల పెంపు, మరోవైపు వివి ధ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రోత్సాహం ద్వారా క్రీడారంగానికి ఊతం ఇవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలిపారు. (Story : కరాటే యువ క్రీడాకారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస)