ఐసీసీ నుంచి అవార్డులు అందుకున్న బుమ్రా
దుబాయ్: ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు హాజరయ్యాడు. పాక్‌పై భారత్ గెలిచిన క్షణాలను మనసారా ఆస్వాదించాడు. మరోవైపు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డులను బుమ్రా అందుకున్నాడు. ఐసీసీ అధికారిక హ్యాండిల్ బుమ్రా ఐసీసీ అవార్డ్స్ 2024లో గెలుచుకున్న అన్ని అవార్డులు, క్యాప్‌లతో పోజులిచ్చిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ పురుషుల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ బుమ్రాకు ప్రకటించింది. అయితే అతను బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటివరకు అందుకోలేదు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న బుమ్రా భారత్-పాక్ మ్యాచ్‌ను మాత్రం చూసేందుకు దుబాయ్ చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ తన దగ్గర ఉన్న నాలుగు అవార్డు ట్రోఫీలను ఆయనకు ప్రదానం చేసింది. (Story: ఐసీసీ నుంచి అవార్డులు అందుకున్న బుమ్రా)