ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పదవ తరగతి బోర్డు పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అన్నారు. గురువారం కొత్తకోట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలలో తప్పకుండా మెస్ కమిటీ ఉండాలని, వంట సామాగ్రి స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థుల మిస్ కమిటీ సమక్షంలోనే దించుకోవాలని సూచించారు. స్టాక్ దించుకున్నప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను దించుకోవాలని సూచించారు. మెస్ కమిటీ విద్యార్థులను పిలిచి స్టాక్ వచ్చినప్పుడు సంతకాలు చేస్తున్నారా లేదా అని అడిగారు. వంట సామాగ్రి కి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు భోజనం వడ్డించడానికి ముందు సూపర్ వైజర్లు రుచి చూడాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్ళీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆహారము, వసతి ఎలా ఉన్నాయని ప్రశ్నించగా బాగానే ఉన్నాయని విద్యార్థులు బదులిచ్చారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో బాగా చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మల్లికార్జున్, తహసిల్దార్ వెంకటేష్, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉన్నారు. (Story : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి)