మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
ఇండియా కూటమిలో చేరేందుకు ప్రత్యేక వ్యూహం
వైఎస్‌ఆర్‌సీపీలోకి కాంగ్రెస్ నేతల ఆహ్వానం?
పరోక్షంగా పావులు కదుపుతున్న జగన్
తండ్రి వైఎస్ సన్నిహితులకు పూర్వవైభవం?
ఎన్డీఏ కూటమి నేత, సీఎం చంద్రబాబు అలర్ట్
న్యూస్ తెలుగు/అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన 2.0 రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయేదీ అంతా కార్యకర్తల కోసమేనన్న జగన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ శ్రేణులు ఉబ్బితబ్బి అవుతున్నాయి. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధినేత జగన్ కార్యకర్తల్ని విస్మరించారన్న వాదనలున్నాయి. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తల్ని గుర్తించలేదనేదీ జగమెరిగిన సత్యం. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా వలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో కార్యకర్తల ప్రమేయం కాస్త తగ్గిపోయింది. ప్రభుత్వానికి, ప్రజల మధ్యన వలంటీర్లు అనుసంధాన కర్తలుగా మారారు. దీంతో కార్యకర్తలకు పనిలేకుండా పోయింది. వారు చేయాల్సిన పనుల్ని అంతా వలంటీర్లే చక్కదిద్దడం, క్రమంగా ఎన్నికల సమయానికి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలోని ఎమ్మెల్యేల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం వరకు ఎవరినీ ఆర్థికంగా ప్రోత్సహించలేదు. పదేళ్లపాటు వైఎస్‌ఆర్‌సీపీ కోసం శ్రమించిన వారికి. ఆస్తులు అమ్ముకున్న వారికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వలేదు. దీంతో విరక్తికలిగిన కార్యకర్తలు..ఎవరి ఓటు వారే వేసుకున్నారేగానీ, తమ పరిధిలోని ప్రజలతో ఓట్లను వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు వేయించలేదని తెలిసింది. జగన్ ప్రభుత్వం గద్దె దిగడానికి గల అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి. వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి తర్వాత..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే..గత ప్రభుత్వ హయాంలో విర్రవీగిన, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి ఒక్కొక్కర్నీ ప్రభుత్వం బయటకు లాగుతోంది. వారిని జైళ్లకు పంపుతోంది. దీన్ని భరించలేక చాలా మంది నియోజకవర్గాలు వదిలి వెళ్లిపోయారు. మరికొందరైతే ఇంతవరకూ ఎక్కడ ఉన్నారనేదీ ఆచూకీ లేదు. దీన్ని గుర్తించిన జగన్..ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు అనుకున్నంతగా న్యాయం చేయలేకపోయానని, ఇక రాబోయే 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యతనిస్తానని సమీక్షల్లో ప్రకటించారు. ఇది కేవలం కార్యకర్తల కోసమే కాదు. జగన్ 2.0లో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల క్షేమంతోపాటు వారిపై కూటమి ప్రభుత్వ హయాంలో దాడులకు పాల్పడిన వారిని, అరాచకాలకు సృష్టించిన వారిపైనా గురిపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అంతకంటే గొప్పగా జగన్ మరో కొత్త రాజకీయ వ్యూహ రచన చేస్తున్నట్లు ప్రచారముంది. అదేమిటంటే..?
ఇండియా కూటమిలోకి జగన్!
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు మింగుడు పడటంలేదు. కేంద్ర, రాష్ట్రాలలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో వారి మాట చెల్లుబాటవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీతోపాటు హోంమంత్రి అమిత్‌షాతో జగన్‌కు మంచి సత్సంబంధాలు ఉండేవి. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీని, అమిత్‌షాను నిత్యం కలిసి వచ్చేవారు. లోక్‌సభ, రాజ్యసభలలో వైఎస్‌ఆర్‌సీపీకి మెజార్టీ సీట్లు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు అన్నింటికీ మద్దతిచ్చేవారు. ఈ తరహాగా మోదీతో జగన్ బంధం ఐదేళ్లపాటు మంచిగానే కొనసాగింది. ఊహించని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు వెళ్లడం జగన్‌కు రాజకీయంగా ఎదురు దెబ్బతగిలింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. అక్కడి నుంచి కేంద్రంలోని మోడీ, అమిత్‌షాతో జగన్‌కు సత్సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి. వైఎస్‌ఆర్‌సీపీ సెక్కులర్ పార్టీగా ఉండటంతో ఎన్డీఏ కూటమిలోకి వెళ్లలేకపోయింది. తాజా రాజకీయాల ప్రకారం కేంద్రంలోని ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం. అక్కడ ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలతో సానుకూలంగా జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జగన్‌కు మంచి సంబంధాలున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల నాటికి కేంద్రంలోని ఇండియా కూటమిలోకి వెళ్లాలన్న దూరదృష్టితో..ఈ 2.0 వ్యూహం తెరపైకి తెచ్చినట్లు ప్రచారముంది. దీని ద్వారా ఏపీలో జగన్‌కు కంట్లో నలుసులా మారిన కాంగ్రెస్ నాయకురాలు షర్మిలకూ చెక్ పెట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలను వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారముంది. ఇటీవల మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఈయన బాటలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్, పల్లంరాజు, హర్షకుమార్ తదితరులు వైఎస్‌ఆర్‌సీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.
సీఎం చంద్రబాబు అలర్ట్!
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ వ్యూహాన్ని ఎప్పటికప్పుడూ ఎన్డీఏ కూటమి నేత, సీఎం చంద్రబాబు పసిగడుతున్నారు. తన రాజకీయ చాణక్యాన్ని చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారు. జగన్ చేసిన విమర్శలపైనా కూటమి నేతలు వెంటనే కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీని బలహీన పరిచే చర్యలకు ఉపక్రమించారు. ఒత్తిళ్లు చేశారా?, లేక ఇంకేమైనా చేశారోగానీ..వైఎస్‌ఆర్‌సీపీలో నంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి బై..బై..చెప్పారు. ఇందులో కూటమి నేతల పాత్ర అధికంగా ఉన్నట్లు తెలిసింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్‌ఆర్‌సీపీకి చాలా మంది నేతలు రాజీనామాలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన బాలినేని శ్రీనివాసులురెడ్డి, సామినేని ఉదయభాను, ఆళ్ల నాని తదితరులు రాజీనామా చేయగా, మరికొందరు కూటమి పార్టీలకు దగ్గరయ్యారు. ఈ చర్యలు వైఎస్‌ఆర్‌సీపీ ఎదుగుదలను బాగా కుంగదీస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపైనా కూటమి నేతలు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఇలా జగన్ ఎత్తులకు..పై ఎత్తులు వేసేలా కూటమి నేతలు నిమగ్నమయ్యారు. జగన్ 2.0 కంటే…చంద్రబాబు విజన్ 2047ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మధ్యమధ్యలో అవినీతి కేసుల్లో ఇరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టులతో జగన్‌కు షాక్‌లు ఇస్తోంది…కూటమి ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ, జగన్ 2.0 వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే! (Story: మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!)
Follow the Stories:
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!