అన్యాయం చేసిన వారి బట్టలూడదీసి నిలబెడతా!
వంశీ అంటే చంద్రబాబుకు అసూయ
తన సామాజిక వర్గంలో బాబు, లోకేష్ లీడర్లా ?
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఎల్లకాలం టీడీపీ ఉండదని పోలీసులు గుర్తెరగాలి
సప్తసముద్రాల అవతలున్నా రప్పిస్తాం
పోలీసులకు జగన్ పరోక్ష హెచ్చరిక
వంశీతో ములాఖత్ అనంతరం మీడియా సమావేశం
న్యూస్ తెలుగు/అమరావతి: ‘ప్రతి పోలీసులకూ చెబుతున్నా..మీ నెత్తిన ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి..అంతేగానీ టీడీపీ నేతలకు సెల్యూట్ చేయడం మానాలి..అలా చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం ప్రభుత్వం ఉంబోదన్న విషయాన్ని పోలీసులు గుర్తెరగాలి..’అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక..అన్యాయం చేసిన వారిని వదిలే ప్రసక్తిలేదని, వారిని బట్టలూడదీసి నిలబెడతామని, పోలీసులు రిటైర్ అయినా, సప్త సముద్రాలు అవతల ఉన్నా రప్పిస్తామని, అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని జగన్ పునరుద్ఘాటించారు. ప్రజలు,దేవుడు శిక్షించే రోజు త్వరలోనే ఉందని, పోలీసు అధికారులు వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని సూచించారు. విజయవాడ గాంధీనగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీతో జగన్ మంగళవారం ములాఖత్ అయ్యారు. దాదాపు 30 నిముషాలపాటు వంశీతోపాటు జగన్ మాట్లాడారు. వంశీ భార్య పంకజశ్రీ..జగన్‌తోపాటు వెళ్లారు. ములాఖత్ అనంతరం జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో శాంతిభద్రతలు దిగజారాయని, చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. నచ్చని వాళ్లపై దొంగ కేసులు, దొంగల సాక్ష్యాలతో అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని, నెలలు నెలలుగా జైళ్లల్లో పెడుతున్నారని ప్రజాస్వామ్యం దిగజారిందనడానికి వంశీ కేసు ఓ నిదర్శనం అని జగన్ అన్నారు. వంశీపై తప్పుడు కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపారని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను బెదిరించి వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఈ కేసులు తనకు సంబంధంలేదని జడ్జికి సత్యవర్థన్ చెప్పినా..చివరకు వంశీపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వంశీని రెచ్చగొట్టేందుకుగాను చంద్రబాబు గన్నవరానికి పట్టాభిని పంపారని, మరోసారి గన్నవరంలో ప్రెస్‌మీట్ పెట్టి వంశీని తిట్టించారని జగన్ గుర్తుచేశారు.అదే రోజు వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంపై దాడికి వెళ్లారని, పట్టాభి అనుచరులు కలిసి ఒక ఎస్సీ నేతలపై దాడి చేశారని తెలిపారు. అడ్డుకోబోయిన సీఐ తలను పగులగొట్టారని, టీడీపీ దాడులను ప్రతిఘటించే సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. రెండు పార్టీలపై ఆ రోజు కేసులు నమోదు చేశారని, ఆ రోజు టీడీపీ నుంచి మూడు ఫిర్యాదులు స్వీకరించారని చెప్పారు. అప్పటి టీడీపీ ఫిర్యాదులో వంశీ పేరు ఎక్కడా లేదని, ఆయన ఘటనలో లేనందనే ఆ రోజు టీడీపీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కేసును రీ ఓపెన్ చేశారని, ఎలాగైనా వంశీని ఇరికించాలని, 71వ నిందితుడిగా చేర్చారని జగన్ వివరించారు. వంశీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతోనే..ఈ కుట్రలను చంద్రబాబు మరింతగా ముందుకు తీసుకెళ్లాడన్నారు.
తన సామాజిక వర్గం వారెదిగితే చంద్రబాబు, లోకేష్‌కు ఈర్ష్య
తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎదుగుతున్నాడని చంద్రబాబు ఈర్ష్య పడుతున్నారని, అందుకే వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కన్నా, లోకేష్ కన్నా గ్లామర్‌గా ఉంటే, తన సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతంటే వారు సహించలేడన్నారు. ఇదే తరహాగా రేపు దేవినేని అవినాష్‌ను కూడా ఇబ్బంది పెట్టవచ్చని, చంద్రబాబు, లోకేష్ మాత్రమే ఆ సామాజిక వర్గానికి లీడర్లా ? అని ప్రశ్నించారు. వారికి అనుకూలంగా లేకుంటే ఆ సామాజిక వర్గం నేతల్నే వెలి వేస్తారన్నారు. తన అనుకూల మీడియాతో కలిసి చంద్రబాబు మాఫియా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం ఓట్లు వేయడం కోసం మాఫియాగా మారారని చెప్పారు. తన సామాజిక వర్గం నేతలపై తప్పుడు కేసులు పెట్టించడం, ట్రోల్ చేయించడం చంద్రబాబు, లోకేష్ నైజమని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికల్లోనూ టీడీపీకి బలం లేకపోయినా అన్యాయంగా ఎంపిక చేసుకుంటోందని జగన్ ధ్వజమెత్తారు. పిడుగురాళ్లల్లో మున్సిపల్ వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుకోవడంలోనూ కనిపించిందని, టీడీపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయిన నిసిగ్గుగా, బలవంతంగా ఆ పదవి దక్కించుకున్నారని, దీని ఆధారంగా చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారనే దానికి నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.
వంశీ కోసం వచ్చిన కొడాలి నాని
వంశీతో ములాఖత్‌తో వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌తోపాటు మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వచ్చారు. ఇంతకాలం ఆయన ఎక్కడా మీడియాకుగాని, తన సొంత గుడివాడ నియోజకవర్గంలోగాని ప్రజలకు అందుబాటులో లేరు. కొడాలి నానిపైనా పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల వంశీని అరెస్టు చేసి విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఈ పరిణామాలతో జగన్ రావడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నేతలంతా విజయవాడకు తరలివచ్చారు. జగన్‌తోపాటు వైసీపీ కీలక నేతలను ములాఖత్‌కు అవకాశం కల్పించలేదు. కేవలం వంశీ భార్య పంకజశ్రీ మాత్రమే లోపలికి వెళ్లారు. పోలీసుల చర్యలపై వైసీపీ నేతలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేదీమీలేక..జగన్ లోపలికి వెళ్లి వచ్చేంత వరకూ బయటే కొడాలి నానితోపాటు మిగిలిన వారంతా వెయిట్ చేశారు. వంశీతో ములాఖత్ అనంతరం జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని ఉన్నారు. ఆయనతోపాటు వైసీపీ నేతలు పేర్ని వెంకట్రామయ్య(నాని), ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, సింహాద్రి రమేష్, మొండితోట జగన్మోహన్‌రావు, నల్లగట్ల స్వామిదాస్, వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు ఉన్నారు. (Story: బట్టలూడదీసి నిలబెడతా!: జగన్)
Follow the Stories:
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!