కిలో చేప రూ.400, రొయ్యలు రూ.900
చికెన్’ డల్..మటన్ ఫుల్!
చేపలు, రొయ్యల కోసం క్యూ
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: చికెన్ వంద..మటన్ వెయ్యి
వినియోగదారుల బెంబేలు
కోడి గుడ్డుకూ నిరాదరణ
న్యూస్ తెలుగు/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా బర్డ్ ఫ్లూ రావడంతో చికెన్ ధరలు చతికిలబడ్డాయి. పోనీ ధరలు తగ్గాయి..కదా మంచిగా చికెన్ కొనుగోలు చేసి ఫుల్‌గా తిందామనుకున్న మాంసాహార ప్రియులకూ అవకాశం దక్కలేదు. ఒక వైపు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షాపులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో రెండు వారాల నుంచి అక్కడి ప్రజలకు చికెన్ అందుబాటులోకి లేకుండా పోయింది. మరోవైపు బర్డ్ ఫ్లూ ప్రభావం లేని చోట చికెన్ కొనుగోలు దుకాణాలు తెరచినా మాంసాహార ప్రియులు ముందుకు రావడం లేదు. చికెన్ ధరలను తగ్గించి అమ్ముతున్నా..వద్దు బాబోయ్ అంటూ మొఖంచాటేస్తున్నారు. ఆదివారంనాడు సైతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ దుకాణాలు వెలవెల బోయాయి. ప్రతి ఆదివారం ఎగబడి కొనుగోలు చేసే వారంతా ఉన్న పళంగా తగ్గిపోవడంతో వ్యాపారస్తులు లబోదిబో మంటున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం చికెన్ ధర రూ.150కి అమాంతంగా పడిపోయింది. కొన్ని చోట్ల రూ.100కే పతనమైంది. ఇదే అదునుగా మటన్ ధరలు మండిపోతున్నాయి. బర్డ్ ప్లూ కారణంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఆయా దుకాణాలకు సరిపడా కోళ్లు లేకపోవడంతో వ్యాపారస్తుల పరిస్థితి దయనీయంగా మారింది. బర్డ్ ఫ్లూ లేని ప్రాంతాల్లోనే చికెన్‌ను విక్రయిస్తున్నారు. చికెన్‌ను ప్రజలు తినవచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నప్పటికీ..ప్రజలు భయాందోళనతో వాటిని తినడం మానేశారు. ఈ రెండు కారణాలతో 70 శాతం చికెన్ విక్రయాలు తగ్గిపోయాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో మాంసాహారులు అంతా చేపలు, రొయ్యలు, మటన్‌పై మోజుపడుతున్నారు. మార్కెట్లో చేపలు, రొయ్యలు, మటన్ కొనుగోలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల మార్కెట్లు రద్దీగా మారాయి. చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటంలేదు. ఇంతకుముందు మార్కెట్‌లో కిలో రూ.800 ఉన్న మటన్ ధర ఇప్పుడు..ఏకంగా కిలో వెయ్యి రూపాయలకు చేరిపోయింది. ఇక చేసేదేమీ లేక మాంసాహారులు మటన్ వైపు చూస్తున్నారు. గతంలో కిలో కొన్న వారంతా ఇప్పుడు దాన్ని అర కిలోకు, గతంలో రెండు కిలోలు కొనుగోలు చేసిన వారు..తాజాగా కిలోకు తగ్గి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మటన్ దుకాణాల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. చేపలు కూడా కిలో 400 రూపాయలకు చేరింది. ఇక సాధారణ రొయ్య కిలో 900 రూపాయలు పలుకుతోంది. చికెన్‌ను ప్రతి వారం కొనుగోలు చేసే మధ్యతరగతి వర్గాలంతా.. మటన్‌ను కొనలేక మౌనంగా ఉండిపోతున్నారు. కనీసం కోడి గుడ్లనూ కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. వారి ఆర్థిక పరిస్థితుల రీత్యా కాయగూరలు, ఆకుగూరలు, పప్పు సంబంధిత వంటకాలకే పరిమితమైపోతున్నారు.
సంక్షేమ హాస్టళ్ల చికెన్ మెనూ నిలిపివేత
బర్డ్ ఫ్లూ ప్రభావం సంక్షేమ హాస్టళ్ల మెనూపైనా పడింది. సంక్షేమ హాస్టళ్లల్లో చికెన్ మెనూ ఉన్న రోజు దాన్ని నిలిపివేసి.. శాఖాహార పదార్థాలను అందించాలని అధికారులు ఆదేశించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం కనిపించింది. గంపలగూడెం మండలం అనుముల్లంకలోని ఒక పౌల్ట్రీ ఫారంలో రెండు రోజుల్లోనే 11వేల కోళ్లు మరణించాయి, మరో 4వేల కోళ్లు వైరస్ బారిన పడ్డాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పౌల్ట్రీ ఫారాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కర్నూలు జిల్లా నర్సింగరావుపేటలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు. పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్‌జోన్ పరిధిలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. చుట్టూ 10 కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పలు చికెన్ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. వారంరోజుల పాటు గుడ్లు, చికెన్‌పై నిషేధం విధించారు.
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే..లక్షణాలివీ..
యాదృచ్ఛికంగా బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలిలా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు రావచ్చు. తలనొప్పితో అలసటగా ఉంటుంది. శరీరమంతా నొప్పి, గందరగోళం, తీవ్ర అలసట అనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పితోపాటు కొంత మందికి మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడొచ్చు. కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చు. అధికార వర్గాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ, చికెన్ తినేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదు. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా..ప్రజలు మాత్రం మటన్‌తోపాటు సీ ఫుడ్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. (Story: చికెన్ వంద..మటన్ వెయ్యి)
Follow the Stories:
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!