దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
నెల రోజుల్లో తెరుస్తామన్నారు
పాతికేళ్లు అయినా తాళం తీయలేదు
ఆలమూరు సబ్ జైలు దీనగాథ వినండి!
(న్యూస్ తెలుగు ప్రత్యేక కథనం)
ఓ సబ్ జైలు దీనగాథ ఇది! ప్రపంచంలో ఎన్నో జైళ్లకు ఎన్నో చరిత్రలున్నాయి. కానీ ఈ జైలును పాతికేళ్ల క్రితం మూసివేయడమే ఓ పెద్ద చరిత్ర. కేవలం దొంగలు పారిపోయారని చెప్పి జైలును మూసివేయడం ఎక్కడైనా విన్నారా? కోనసీమ జిల్లాలోని ఆలమూరు సబ్ జైలుకు వెళ్తే వినడమే కాదు కళ్లారా కనొచ్చు కూడా.
కరుడుగట్టిన నేరస్తులు సబ్ జైల్లో ఉంటే కంటికి రెప్పలా కాపలా కాయాల్సిన పోలీసులు టేపు రికార్డర్ లో పాటలు వింటూ నిర్లక్ష్యం వహించారు. దీన్ని అదునుగా చేసుకునే సబ్ జైలు ఊచలు కట్ చేసి నలుగురు ముద్దాయిలు పరారయ్యారు. రెండు గదులలో ఉన్న ఖైదీలు పరారైనందున వాటికి మరమ్మతు చేసి నెల రోజుల్లో మళ్లీ తెరుస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. ఇది జరిగి ఏ వారం రోజులో పది రోజులో కాలేదు. సరిగ్గా 25 సంవత్సరాలైంది. ఇది ఆనాటి మాట! నేటికీ ఈ జైలును తెరవలేదు. తాళాలు సైతం తుప్పుపట్టిపోయాయి. ఇప్పటికి పాతిక సంవత్సరాలు అయింది కానీ ఈ సబ్ జైలు తాళం మాత్రం తీయలేదు. లోపల అంతా చెట్లు పెరిగిపోయి గోడలు చీల్చుకుంటూ బయటికి వచ్చేస్తున్నాయి. జైలు లోపల భయంకరమైన విష సర్పాలు పుట్టలుపుట్టలుగా పెరిగిపోయి విషం గక్కుతున్నాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ జైలులో 2000వ సంవత్సరం మే 29న ఈ సంఘటనలు జరిగాయి. అయితే ఈ సంఘటనల పరంపర ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగానే కాదు ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. కపిలేశ్వరపురం మండలం అచ్చుతాపురంలోని ఓ రైస్ మిల్లుకు చెందిన బియ్యం లోడు లారీని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన షేక్ నాగూర్ వలీ, అతని సోదరుడు హుస్సేన్‌లు దొంగిలించుకుపోయారు. అప్పటికే వారు అనేక హత్యలు వంటి పెద్ద పెద్ద కేసుల్లో నేరస్తులు. వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఈ సబ్ జైలుకు తీసుకొచ్చారు. ఆలమూరు కోర్టులో వాయిదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో మండపేటకు చెందిన దొడ్డి రాంబాబు అనే సైకిల్ దొంగ, అలాగే మండపేట మండలం ద్వారపూడి పెట్రోల్ బంక్ లో రూ.రెండు వేలు దొంగతనం చేస్తూ పట్టుపడ్డ రాయుడు దుర్గారావు కూడా ఈ సబ్ జైల్లో ఉన్నారు. ఈ నలుగురుని రెండు వేరువేరు సెల్(గదులు)లోనే ఉంచారు. మొత్తం ఈ జైలులో ఏడు సెల్‌లు ఉండగా రెండు, ఐదు నెంబరు సెల్ లలో ఈ నలుగురిని ఉంచారు. పలు కేసులలో ఉన్న గుంటూరు బ్రదర్స్‌కు వేర్వేరు గదులనే కేటాయించారు.
ఇంత పెద్ద నేరస్తులు జైలులో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అలా చేయకపోవడం వల్ల ఈ దొంగలు ఎంతో పట్టిష్టమైన 26 ఎంఎం జైలు ఊచలను రంపపు బ్లేడ్‌తో కోసేశారు. పోలీసులు టేప్ రికార్డర్‌లో (ఆనాడు టేప్ రికార్డర్లే. మొబైల్ నెట్ ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు) పాటలు వింటుంటే ఆ సౌండ్ లో అనుమానం లేకుండా వీరు ఈ ఊచలను కోయగలిగారు. అయితే వీరికి పగటిపూట గదుల బయట పనులు పురమాయించడంతో వారు ఈ బ్లేడును సంపాదించి రెండు ముక్కలుగా చేసి కొన్ని రోజులు పాటు శ్రమించి ఊచలను కట్ చేసేశారు. అనంతరం ఓ అర్ధరాత్రి పోలీసులు నిద్రిస్తుండగా తువ్వాలతో అప్పటికే కట్ చేసిన ఊచలను లాగి బయటపడ్డారు. కరుడుగట్టిన నేరస్తులైన అన్నదమ్ములే గాక చిల్లర దొంగతనం చేసే మిగిలిన ఇద్దరినీ కూడా వెంటబెట్టుకుపోయారు. జైలు గది నుంచి బయటకు వచ్చిన వీరు ప్రహరీగోడ దూకే సమయంలో పెంకులు రాలి కింద పడడంతో ఆ జైలు గదులలో ఉన్న మిగిలిన ఖైదీలు పారిపోతున్నారని అరవడంతో అప్పుడు ఈ పోలీసులకు మెళకువ వచ్చి వెంట పడ్డారు. గోడ ఎక్కే చివర ఖైదీని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను కూడా విదిలించుకుని గోడ దూకి పరారయ్యాడు.
ఖైదీలు పరారైన సమాచారం తెలుసుకున్న వెంటనే అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎబి వెంకటేశ్వరరావు ఈ జైలు వద్దకు వచ్చారు. అప్పుడు డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. పరారైనవారిని పట్టుకోవడానికి మండపేట, అనపర్తి, అమలాపురం, పిఠాపురం సిఐల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను నియమించారు. అలాగే జైళ్ల శాఖ డీఐజీ అహ్మద్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని జైలు సూపరింటెండెంట్ అహ్మద్ తోపాటు హెడ్ వార్డెన్, ముగ్గురు వార్డెన్లను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆ సబ్ జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలను రామచంద్రపురం సబ్ జైలుకు తరలించారు. నెల రోజుల్లో ఈ సబ్ జైలుకు మరమత్తులు చేసి మళ్లీ తెరుస్తామని అప్పుడు డిఐజి ప్రకటించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాలి కదా… మండపేట కు చెందిన చిల్లర దొంగలు ఇద్దరు కొద్దిరోజులకే పోలీసులకు చిక్కారు. కాని కరుడుగట్టిన నేరస్తులైన గుంటూరు అన్నదమ్ములు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించారు. ఎంత గాలించినా వారి ఆచూకీ లభించలేదు. కొన్ని నెలల తర్వాత మధ్యప్రదేశ్‌లో దొంగతనం కేసులో ఆ రాష్ట్ర పోలీసులకు ఇద్దరు అన్నదమ్ములు చిక్కారు. దీంతో పోలీసులపై ఉన్న సస్పెన్షన్ లను తొలగించారు. కాని సబ్ జైలును మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. నెలలూ.. సంవత్సరాలు గడుస్తున్నా ఈ సబ్ జైలును తెరిపించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. సబ్ జైలు మూసుంటే ఇప్పుడు ప్రజలకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ సబ్ జైలు లేకపోవడం వల్ల పోలీస్ యంత్రాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎందుకంటే ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ఆలమూరు, మండపేట టౌన్, రూరల్, అంగర(కపిలేశ్వరపురం) పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించిన నిందితులందరినీ ఆలమూరు సబ్ జైలుకే తీసుకొచ్చేవారు. దీంతో కేసుల వాయిదాలకు పక్కనే ఉన్న ఆలమూరు కోర్టుకు తీసుకెళ్లడం ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇక్కడ సబ్ జైలు లేకపోవడం వల్ల రామచంద్రాపురం సబ్ జైలు లేదా రాజమహేంద్రవరం సెంటర్ జైలుకు ముద్దాయిలను తీసుకెళ్లవలసి వస్తుంది. వారిని వాయిదాలకు తీసుకురావడం, తీసుకెళ్లడం పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.
ఈ సబ్ జైలు మూసి ఉండటం వల్ల ప్రధాన సమస్యలు ఇవి మాత్రమే కాదు. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ సబ్ జైల్లో చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటితో పాటు పెద్దపెద్ద పాములు కాపురాలు పెట్టాయి. దీంతో ఈ సబ్ జైలును ఆనుకొని ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ బెంబేలెత్తి పోవాల్సి వస్తుంది. ఈ సబ్ జైలు చెంతనే తాహసిల్దార్ కార్యాలయం, స్త్రీ శక్తి భవనం, మండల పరిషత్తు, విద్య, వ్యవసాయ, సబ్ రిజిస్ట్రార్, కోర్టు, సబ్ ట్రెజరీ వంటి కార్యాలయాలు ఉన్నాయి. ఈ జైలులో ఉండే పాములు బయటకు వస్తుండటంతో ఇక్కడ అధికారులు ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి ఈ జైలు గోడలను చీల్చుకుంటూ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సబ్ జైలు ఎందుకూ పనికిరాదు. అందువల్ల పూర్తిగా తొలగించేస్తే కనీసం ఈ పాముల భయం పోతుందని అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. తిరిగి సబ్ జైలు నిర్మిస్తారా..? లేదా..? అన్నది తర్వాత మాట. ప్రస్తుతం ఉన్న దాన్ని మాత్రం పూర్తిగా తొలగించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నది.
చివరగా.. మరో ఆసక్తికరమైన సంఘటన పదిహేను సంవత్సరాల క్రిందట జరిగింది. అదేంటంటే ఈ ప్రాంతంలో అన్ని శాఖలకు సొంత భవనాలు ఉన్నాయి కదా అని గృహనిర్మాణ శాఖ వారు ఈ సబ్ జైలు సమీపంలో సొంత భవన నిర్మాణం మొదలుపెట్టారు. అయితే పునాదులు నిర్మించిన తర్వాత జైళ్ల శాఖ వారు వచ్చి అభ్యంతరం తెలిపారు. ఈ భవనం సబ్ జైలు నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీని వల్ల నిందితులు జైలు నుండి పారిపోవడానికి అవకాశం ఉంటుందంటూ నిర్మాణాన్ని నిలిపివేసారు. దీంతో అక్కడ భవన నిర్మాణం నిలిచిపోయింది కాని ఈ సబ్ జైలు మాత్రం తెరుచుకోలేదు. ఈ సబ్‌జైలు చరిత్రకు ఫుల్‌స్టాప్ పడుతుందా? లేదా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. (Story: దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!)
ఈ స్టోరీ రచయిత : కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు (9490352045)
Follow the Stories:
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!