డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ పేరుతో కొత్త విధానం
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
చంద్రబాబు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు
ఉచితంగా డిజిటల్ స్లాట్ బుకింగ్ సేవలు
స్లాట్ రద్దుకు రూ.100
సమయం మార్చుకుంటే రూ.200
న్యూస్ తెలుగు/అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అనుమతి తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచి, ఆ శాఖకు తగిన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపునకు మార్గాలు రూపొందించింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం సంపద పెంపు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పరుగులు పెడుతోంది. వీలైనంత వరకు ఐటీ రంగ సేవల విస్తరణకు సన్నద్ధమైంది. తాజాగా వాట్సాప్ ద్వారా ఈ-గవర్నెన్స్‌కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖలోనూ డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థను తీసుకొచ్చి..ప్రజలకు సులువుగా సేవలు అందించనుంది. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందించనున్నట్లు వివరించింది. డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్‌ను రద్దు చేసుకుంటే రూ.100, సమయం మార్పు చేస్తే రూ.200 చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబధించిన ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన ఈ సిస్టమ్ ద్వారా అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులంతా ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రెషన్‌లు, లేదా వివాహ రిజిస్ట్రేషన్ లాంటి వివిధ సేవలను ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. అందువల్ల రిజిస్ట్రేషన్ శాఖలోడైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఒకింత ప్రజలకు ఉపయుక్తమే. కాకపోతే, వీటిమీదనే బతుకుతున్న డాక్యుమెంట్ రైటర్లు, తదితరులకు పని తక్కువైపోతుంది. ఈ తరహా పారదర్శకమైన వ్యవస్థ వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ఆశిస్తున్నప్పటికీ, అలాంటిదేమీ ఉండదని రిజిస్ట్రేషన్ కార్యాలయ వర్గాలు చెపుతున్నాయి. ఎన్ని కొత్త వ్యవస్థలు తీసుకువచ్చినా, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని ఆపలేమని ఆ వర్గాలే అంటున్నాయి. కాకపోతే, కొత్త వ్యవస్థ రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం చేస్తుందని పేర్కొన్నాయి.
జనవరి చివరిలో రిజిస్ట్రేషన్ శాఖకు భారీ ఆదాయం
ఇదిలాఉండగా, ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండటంతో గత జనవరి చివరిలో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వచ్చి పడింది. కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 20 శాతం మధ్య భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి. జనవరి 30, 31 తేదీల్లో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. జనవరి 30వ తేదీన ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగి, ప్రభుత్వానికి రూ. 107 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. సాధారణంగా ప్రతి రోజు సగటున 7 వేల నుంచి 8 వేల వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీని వల్ల రూ.25-30 కోట్ల వరకు ఆదాయం వస్తుంటుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా అల్లూరి జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగని పరిస్థితి ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిబ్రవరి నుంచి మందకొడిగా రిజిస్ట్రేషన్లు
చాలా చోట్ల భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంతో ఫిబ్రవరి నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాధారణంగానే రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. ఆశించిన స్థాయిలో క్రయ, విక్రయాలు కొనసాగడం లేదు. ఎక్కడికక్కడే భూముల ధరలు 200 నుంచి 300 శాతానికి పెరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అమరావతి రాజధాని పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో పెంచారు. అమరావతి రాజధాని సమీపాన నగరాలైన గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇప్పటికే భూములకు భారీగా రెక్కలు వచ్చాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. దానికితోడుగా రైతులు పొలాల ధరలను భారీగా చెప్పడంతో రియల్ ఎస్టేట్ నిర్వాహకులూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేసి..ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఒక వైపు భూముల రిజిస్ట్రేషన్ విలువులను ప్రభుత్వం పెంచింది. మరో వైపు ప్రస్తుతం కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సరళ తరం చేసేందుకుగాను ఆన్‌లైన్ డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ విధానానికి శ్రీకారం చుట్టింది. (Story: రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!