Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

విజయవాడ ఎక్స్‌పోల ఏర్పాటులో ‘మున్సిపల్‌’ దందా

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

ఫీజు కడితే.. లైసెన్స్‌ మంజూరు చేసినట్లేనా?

ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు లైసెన్స్‌ సర్టిఫికెట్‌ ఎందుకు మంజూరు చేయలేదు?

నిర్వాహకులకు లైసెన్స్‌ జారీ చేయని ప్రజారోగ్యం విభాగాధికారులు

ట్రేడ్‌లైసెన్స్‌ అప్లికేషన్‌ సీడీఎంఏ వెబ్‌సైట్‌లో నమోదు చేయని ప్రజారోగ్యాధికారులు

లైసెన్స్‌ ఫీజు ఏ పద్దులోనైనా జమయిందా..లేక ఎవరి జేబులోకైనా వెళ్ళిందా?

ఫీజును చలానాగా చూపిస్తూ మాయచేస్తున్న ప్రజారోగ్య విభాగాధికారులు

కమిషనర్‌ను సైతం తప్పుదోవ పట్టించిన అధికారులు

ప్రజారోగ్యం విభాగం అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఎందుకివ్వలేదు?

న్యూస్‌తెలుగు/విజయవాడ కార్పొరేషన్‌: జనకన్య ఎగ్జిబిషన్‌ దగ్థమైన ఘటన బెజవాడలో వివాదం రేపుతోంది. లైసెన్సుల మంజూరులో జరుగుతున్న అవకతవకలు, అవినీతి ఛాయలు వెలుగులోకి వస్తున్నాయి. కార్పొరేషన్‌ అధికారుల దగాకోరు విధానాలు, లైసెన్సుల జారీలో లొసుగులు బయటపడుతున్నాయి. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్కిల్‌`3 భవానీపురం లేబర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన కాశ్మీర్‌ జల కన్య ఎగ్జిబిషన్‌లో గత బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎగ్జిబిషన్‌ అగ్ని ప్రమాదానికి సంబంధించి విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర, ఎస్టేట్‌, ఫైర్‌, జోనల్‌ కమిషనర్‌లను మాత్రమే బాధ్యులను చేస్తూ  షోకాజ్‌  నోటీసులు జారీ చేశారు. కానీ ప్రజారోగ్య విభాగ అధికారులు ప్రమాదం జరిగే నాటికి ఎగ్జిబిషన్‌ నిర్వాహకుల దగ్గర నుండి లైసెన్స్‌ ఫీజు కట్టించుకున్నారే తప్ప వారికి తాత్కాలిక ట్రేడ్‌ లైసెన్స్‌ మంజూరు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి వీరు బాధ్యులు కారా..? వీరి ప్రమేయం లేదా..? ప్రజారోగ్యం విభాగ అధికారులకు ఎందుకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వకూడదని కార్పొరేషన్‌ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిబిషన్‌ కోసం నిర్వాహకులు రెండు నెలలు క్రితం లేబర్‌ కాలనీలో రెండు నెలల పాటు లీజుకు తీసుకున్నారు. ఎస్టేట్‌, ఫైర్‌ విభాగాలు ఇచ్చిన గడువు ముగిసింది. ఇందుకు ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం కార్పొరేషన్‌కు డబ్బులు మాత్రమే కట్టారు. ప్రజారోగ్యం విభాగం అధికారులు రశీదు మాత్రమే ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు ఇచ్చారు. రశీదు చూపించి, ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండానే గత రెండు నెలలుగా ఏగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. కార్పోరేషన్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ను జారీ చేయలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఎగ్జిబిషన్‌కి సంబంధించిన అప్లికేషన్‌, నెంబర్‌, సర్టిఫికెట్‌ను నిర్వాహకులు ఎక్కడ చూపించకుండా ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నరని, కార్పొరేషన్‌కు కట్టిన డబ్బుల రశీదును మాత్రమే చూపించి అనుమతి పొందినట్లు ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు చెప్పటం ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ను కార్పోరేషన్‌ ప్రజారోగ్యా విభాగాధికారులు జారీ చెయ్యలేదనేదానిపై స్పష్టం కావటంతో పాటు ఈ వ్యవహారంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ పొందే విధానం..
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏ వ్యాపారం ప్రారంభించాలన్న నగరంలో సంబంధిత సచివాలయంలోగాని, లేదా కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌( సీడీఎంఏ) వెబ్‌సైట్‌లో గానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వారికి ఆన్‌లైన్‌లో అర్జీదారుడికి ఒక నంబరు జనరేట్‌ అవుతుంది. అర్జీ నెంబర్‌ నగదు కౌంటర్‌లో చూపించి ఆన్‌లైన్‌లో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించాలి. అక్కడి నుండి అప్లికేషన్‌ సంబంధిత శానిటేషన్‌ సచివాలయం సెక్రటరీ వద్దకు, తదుపరి శానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌, సూపర్‌ వైజర్‌, ఆ తర్వాత చీఫ్‌ మెడికల్‌ అధికారికి వెళుతుంది. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆమోదం తెలిపిన అనంతరం అర్జీదారులు కమిషనర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ గవర్నమెంట్‌ వెబ్‌సైటులో ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదీ ట్రెడ్‌ లైసెన్స్‌ పొందే విధానం.. కానీ భవానిపురం లేబర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన జల కన్య ఎగ్జిబిషన్‌ విషయంలో ఏమి జరిగిందంటే..? అర్జీదారుడు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు పెట్టకుండా ప్రజారోగ్య విభాగాధికారుల ఆదేశాల మేరకు నేరుగా నగదు కౌంటర్‌కు వెళ్లి నగదు చెల్లించినట్లు సమాచారం. నగదు చెల్లించినప్పుడు నిర్వాహకులు రశీదు మాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. చెల్లించిన నగదు ఏదైనా పద్దులో జమ అయ్యిందా? లేక ఎవరి జోబులోకైనా వెళ్లిందా..? అనేది ఆ విభాగాధికారులకే తెలియాలి..! అర్జీదారుడు నగదు చెల్లించిన రసీదును జతపర్చి, ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం ప్రజారోగ్య విభాగాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజారోగ్య విభాగాధికారులు యధావిధిగా మున్సిపల్‌ కమిషనర్‌కు ఫైలు పంపారని తెలిసింది. లైసెన్స్‌దారుడు సీడీఎంఏ వారి ఆన్‌లైన్‌లో కాకుండా గుట్టుగా డబ్బులు కట్టించుకుని నగదు రసీదు ఇచ్చి లైసెన్స్‌ వచ్చినట్లు చూపించాల్సిన అవసరం ఏముంది? ఇంతజరిగినా, నిర్వాహకులకు ప్రజారోగ్య విభాగాధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదని సమాచారం. ఒక వేళ ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తే, జారీ చేసిన సర్టిఫికెట్‌ ఎందుకు బయట పెట్టలేదని ఆ విభాగం అధికారులపై ఆరోపణలు వస్తున్నా సమాధానం లేకపోవటం గమనార్హం. ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ కోసం మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రజా ఆరోగ్యం విభాగం అధికారులు కమిషనర్‌ను తప్పుదోవ పట్టించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సీడీఎంఏ వారు రూపొందించిన ఆన్‌లైన్‌ వ్యవస్థలో మాత్రమే అన్ని పన్నుల వసూళ్లను జనరేట్‌ చేస్తారు. జల కన్య ఎగ్జిబిషన్‌కు సంబంధించి ట్రేడ్‌ లైసెన్స్‌ విధానంలో అధికారులు సీడీఎంఏ నియమ నిబంధనల ప్రకారం జరగాలి కానీ అందుకు విరుద్ధంగా పని చేశారని తెలుస్తోంది. ప్రజారోగ్యం విభాగం అధికారులు చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు లైసెన్స్‌ ఫీజు కట్టించుకున్నారు. అదే ట్రేడ్‌ లైసెన్స్‌ అని చెపుతున్నారు. అది ట్రేడ్‌ లైసెన్స్‌ ఎలా అవుతుంది? సీడీఎంఏ ఉత్తర్వుల ప్రకారం తాత్కాలికమైన..శాశ్వతమైన ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే సీడీఎంఏ వారు పొందుపరిచిన ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు చేసి సర్టిఫికెట్‌ జారీ చెయ్యాలి. ప్రజారోగ్యం విభాగం అధికారులు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి నగదు రశీదును ట్రేడు లైసెన్స్‌గా చూపిస్తున్నారని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నాకు ఏమీ తెలియదు..
భవానీపురం లేబర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌కు సంబంధించి ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ విషయంలో నాకు ఏమీ తెలియదు. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు గురించి అంతా పై అధికారులయిన శానిటరీ సూపర్‌వైజర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వంటి వారే చూసుకున్నారు.
 -రాజు, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌, 44వ డివిజన్‌, విజయవాడ.
ఫీజు ముఖ్యమా..! లైసెన్స్‌ ముఖ్యమా..?
ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో పెట్టరు. టెంపర్‌వరీ వాటికి సీడీఎంఏ ద్వారా ప్రాసస్‌ ఉండదు. గతంలో వాటికి అలా కట్టిచ్చారు. లైసెన్స్‌ సర్టిఫికెట్‌ అమౌంట్‌ ముఖ్యమా? లైనెన్స్‌ ముఖ్యమా? లైసెన్స్‌ ఫీజు కట్టి ఇచ్చామా..! లేదా..? అన్నది ముఖ్యం. భవానీపురం జల కన్య ఎగ్జిబిషన్‌కు ట్రేడ్‌ లైసెన్స్‌ విషయంలో స్థానిక శానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ రిమార్క్స్‌ ప్రకారం అన్ని చేశాం. ఆన్‌లైన్‌లో నమోదయితే ప్రమాదాలు జరగవా?
 -శివరాం ప్రసాద్‌, శానీటరీ సూపర్‌ వైజర్‌, విజయవాడ. (Story: లైసెన్సుల్లో గోల్‌మాల్‌!)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!