వినుకొండ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నందు దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. ఫిబ్రవరి 14, 1921 కర్నూలు జిల్లా,కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో మునిదాసు సుంకలమ్మకు సంజీవయ్య జన్మించారు. తాను పుట్టిన మూడు రోజులకే తండ్రిని కోల్పోయినా,కష్టపడి చదువు కొనసాగించారు. ఆయన ఆరోజుల్లోనే మద్రాస్ లా కాలేజీ నుండి లాయర్ డిగ్రీ పొందారు. మద్రాసులో లా చదివే రోజుల్లో మెస్ చార్జీల కోసం ఆయన గణిత ఉపాధ్యాయిడిగా పని చేస్తూ కష్టపడి చదువుకున్నారని కొనియాడారు. 29 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యారని,అలాగే 31 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో, సి.రాజగోపాలచారి కాబినెట్ లో మంత్రిగా కూడా ఆయన ఎన్నిక అయ్యారన్నారు. అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్నారు. ఒంటిచేత్తో 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన ఏఐసీసీయూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎన్నిక 1964 సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కొంతకాలం నెహ్రు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా,వాణిజ్య శాఖ మంత్రిగా,ఇందిరా గాంధి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా,ఎన్నికై,కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. దేశంలో మొట్టమొదటి వృధాప్య పింఛన్ల,వితంతు పింఛన్ల పధకం ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 1960 సంవత్సరంలో పేదలకు 6 లక్షల ఎకరాల ఇళ్ల పట్టాల పంపిణి, బి.సి రిజర్వేషన్లు 24% నుండి 38%కు పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పెంచడానికి కారణం ఆయనేనని, అలాగే నిర్బంధ ప్రాథమిక విద్య,ఉన్నత చదువుల్లో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, మధ్యాహ్న భోజన పధకం కూడా ఆయన ప్రవేశ పెట్టిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు పమిడిపల్లి ఇజ్రాయిల్, గౌరవ సలహాదారులు కొమ్మతోటి కృపయా, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు బేతం దేవానంద్, మండల ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, రాయన చిన్న,కొట్టే వెంకట్రావు,అంబడపూడి శ్రీను, పల్లపాటి భాస్కర్, బిల్లా ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు )