విజయవాడ, హైదరాబాద్‌లో అలెర్ట్!
కోళ్ల కోత: బర్డ్ ప్లూ ఎఫెక్ట్!
లక్షలాది కోళ్ల మృత్యువాత
తినేందుకు ప్రజల వెనుకంజ
తెలుగు రాష్ట్రాల్లో భయాందోళన
భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు
ఫౌల్ట్రీ యాజమాన్యానికి భారీ నష్టం
న్యూస్ తెలుగు/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వేలాది కోళ్లు మృతి చెందినట్లు మొదట చెప్పారు. నిజానికి వేలు కాదు..లక్షలాది కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా కోళ్లు సరఫరా అవుతున్నాయి. తెలంగాణ అధికారులు రాష్ట్రానికి రాకుండా బోర్డర్‌లో అడ్డుకుంటున్నారు. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్‌లోని అంతర్‌రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కోళ్ల వాహనాలు వస్తుంటే వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు తెలంగాణ అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను సైతం అడ్డుకుని వెనక్కి పంపించారు. గత వారం రోజులుగా రోజుకు పది, పదిహేను లారీలను సైతం వెనక్కి పంపిస్తున్నారు. కోళ్లకు వైరస్ కారణంగా చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఉడికించిన చికెన్, గుడ్డును తినొచ్చా? లేదా? అనే సందేహాలు వెలువెత్తుతున్నాయి. ప్రజలు చికెన్, గుడ్డు తిసుకున్నప్పటికీ.. ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ఎవ్వరూ చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. ఏపీలో ఇప్పటికే లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇది వరకు కిలో చికెన్ ధర రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా, ప్రస్తుతం భారీగా తగ్గింది. మంగళవారం రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయించారు. తాజాగా అంటే గురువారం కిలో ధర 70 రూపాయలకు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. బర్డ్‌ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోడిగుడ్డు ధర 6 రూపాయలు ఉండగా, ప్రస్తుతం తగ్గింది. తెలంగాణలోని ప్రాంతాల్లో చికెన్ ధర భారీగా తగ్గింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్స్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. కానూరులో బర్డ్స్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటు సీతానగరం మండలం, మిర్తిపాడులో కూడా బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది. మిర్తిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన కోళ్ల ఫారంలో ఒకే రోజు 8వేలకు పైగా కోళ్లు మృతవాత పడ్డాయి. అధికారులు అప్రమత్తమై మిర్తిపాడు గ్రామాన్ని కిలోమీటర్ ఉన్న ఏరియాను రెడ్ జోన్‌గా.. ఆనుకుని ఉన్న 10 కిలోమీటర్ల ప్రాంతమంతా బఫర్ జోన్‌గా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు.
ఉభయ గోదావరి, కృష్ణాలో విస్తరించిన బర్డ్ ప్లూ
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ప్లూ విస్తరించింది. ఈ క్రమంలోని గ్రామమంతా పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది శానిటేషన్ పనిలో పడ్డారు. సీతానగరం మండలంలో చికెన్‌కు తినొద్దని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల ఫారంలో ఉన్న మిగిలిన కోళ్లు మృత్యువాత పడుతుండడంతో సమీపంలోని ఆరడుగుల గొయ్యి తీసి పూడ్చివేశారు అధికారులు. డిస్ట్రిక్ట్ యానిమల్ అధికారి శ్రీనివాస్ సమక్షంలో చనిపోయిన కోళ్ల స్వాబ్స్ ద్వారా శాంపిల్‌ను కలెక్ట్ చేసి వైద్య పరీక్షలను వెటర్నరీ డాక్టర్లు నిర్వహించారు. మిర్తిపాడు గ్రామంలో కోళ్ల ఫారం ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కూడా అధికారులు అలెర్ట్ అయ్యారు. రెడ్ జోన్‌కి దగ్గరలో ఈ హైస్కూల్ ఉండడంతో ఉపాధ్యాయులు, అక్కడ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉదయాన్నే హైస్కూల్ ఆవరణలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు వైద్యులు. భోజనాల సమయంలో ఈగలు అధికంగా వాలుతున్నాయంటూ విద్యార్థులు, కోళ్ల ఫారం సమీపంలో ఉన్న స్థానికులు వెల్లడించారు. అధికారుల పర్యవేక్షణలో కోళ్ల ఫారంలోని మిగిలిన కోళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే 8000 పైగా కోళ్లు చనిపోగా.. ఫారంలో మిగిలిన కోళ్లుకు ఫీడ్ పెట్టడం మానేసారని, ఇదే తరహాలో చనిపోయే అవకాశాలున్నట్లు వెటర్నరీ వైద్యులు అంచనా వేస్తున్నారు. సమీప గ్రామ ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడం మానేస్తే మంచిదని సూచిస్తున్నారు అధికారులు. కోడిగుడ్లు కూడా తినకుండా కొన్ని రోజులు దూరంగా ఉండాలని మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలంలోని అసుమోల్లంకలో శ్రీబాలాజీ ఫౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ కారణంగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. రెండు రోజుల్లోనే మొత్తం 10వేలకు కోళ్ల మృతులు చేరాయి. వైరస్‌తో చనిపోయిన ప్రాంతాల్లో పది కిలో మీటర్ల పరిధిలోని చికెన్ షాపులను అధికారులు మూయిస్తూ, కోళ్లు, గుడ్లు తినవద్దని ప్రచారం చేస్తున్నారు. మృతి చెందిన కోళ్లను టెస్ట్‌ల కోసం ల్యాబ్‌లకు పంపుతున్నారు. తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందనీ, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఫౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు. బర్డ్ ప్లూ సోకిన కోళ్లను నిర్మూలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని నిర్మూలించారు. ఈ ముప్పు విజయవాడకు పాకే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. (Story: కోళ్ల కోత: బర్డ్ ప్లూ ఎఫెక్ట్!)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

