వినుకొండ పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా లెదర్‌పార్కు
లెదర్ పార్కు భూమి చదును పనులు పర్యవేక్షించిన జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు/వినుకొండ: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వినుకొండలో ఏర్పాటు కాబోతున్న లెదర్ పార్కు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేయనుందన్నారు చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇచ్చిన మాట ప్రకారం మల్టీ నేషనల్ కంపెనీలతో కొలువుదీరనున్న లెదర్ పార్క్ ఇక్కడి పారిశ్రామిక ప్రగతిలో కీలకంగా మారనుందన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద లెదర్ పార్కు ఏర్పాటు కాబోతుందని తెలిపారు. సోమవారం అందుకు సంబంధించి కేటాయించిన భూముల్ని ఆయన పరిశీలించారు. వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ 1లో కేటాయించిన 98.20 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూములను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించారు. యంత్రాలతో ముమ్మరంగా సాగుతున్న భూముల చదును పనుల్ని పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ లెదర్ పార్క్‌లో రీబాక్, పుమా, నైక్ వంటి పలు దిగ్గజ సంస్థలు తమ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయన్నారు. ఈ పార్కు నిర్మాణం ద్వారా 20 వేల నుంచి 30 వేలమంది చర్మకారులకు ఉపాధి లభించబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తాను ఎంతోకాలంగా ఈ పార్క్ కోసం చేసిన ప్రయత్నాలు ఇలా కార్యరూపం దాల్చుతూ ఉండడం చాలా సంతోషం అందిస్తోన్నట్లు తెలిపారు. చర్మకార వృత్తిదారుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎప్పటి నుంచో ఈ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఉన్నా మధ్యలో వైకాపా ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదన్నారు. లెదర్ పార్క్ వస్తే ఆ వృత్తిలోని యువతకు ఆధునిక, సాంకేతిక శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంచే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం విషాదమని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబా బు దృష్టి సారించడం, కేంద్రంతో సమన్వయం, సహకారంతో ఇలా లెదర్ పార్క్ స్వప్నం సాకారం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. (Story: వినుకొండ పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా లెదర్‌పార్కు)