మంత్రి సంధ్యారాణిపై రాజన్నదొర విమర్శనాస్త్రాలు
న్యూస్ తెలుగు/సాలూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సంధ్యారాణికి ఉందా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడికి రాజన్న దొర ప్రశ్నించారు. అహంకారంతో మాట్లాడిన వారందరని ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలిసినని అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ గాని, ఒక సంక్షేమ పథకం గాని ప్రజలకు ఇవ్వకపోవడంతో ఇలాంటి ప్రజా సమస్యపై ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడగడం తప్పా అని అన్నారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆమె అహంకారం నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా, ప్రజల దృష్టిని మళ్లించేలా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇదేనా నీ స్థాయి అని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని ఇప్పటికీ 1 లక్ష 45వేల కోట్లు అప్పు తీసుకోవడం జరిగిందని అన్నారు. జగన్ బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు పంచితే శ్రీలంక, వెనిజులా ఆంధ్రప్రదేశ్ అవుతుందని చంద్రబాబు నాయుడు అనలేదా అని అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలకు ఒక రూపాయి అయినా పంచారా అని అన్నారు. సూపర్ సిక్స్ హామీలైన తల్లి కి వందనం, నిరుద్యోగ భృతి , అన్నదాత సుఖీభవ, మహిళలకు నెలకి 1500 రూపాయలు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలని తుంగలో తొక్కారని అన్నారు . ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ర్యాంకులు తగ్గించి ఆయన్ను కించపరిచేలా టిడిపి నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. సాలూరు నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా జగన్ ను విమర్శించే స్థాయి నీదా అని అన్నారు. ఎన్నికల్లో కుడుమూరు భూములు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని, ఈ సమస్యపై గిరిజనులు అడిగితే కనీసం పట్టించుకోలేదని అన్నారు. కోటియ గ్రామాల్లో ఒరిస్సా పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పైలెట్ వాటర్ స్కీమ్ సామాన్లు పట్టుకెళ్తే కనీసం స్పందించుకోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. జీవో నెంబర్ 3 కు వ్యతిరేకంగా జగ్గుదరవలసలో 300 రోజులు గిరిజనులు ధర్నాలు చేస్తే వారికి సంఘీభావం తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలో కి వచ్చిన తర్వాత ఈ సమస్యలపై పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ ను గాని, పవన్ కళ్యాణ్ గాని హామీలపై ప్రశ్నించానే తప్పా వ్యక్తిగతంగా వారిని విమర్శించలేదని ఇదే నా సంస్కారం అని అన్నారు. అనవసరంగా మా నాయకుడి పై బురద జల్లి మాట్లాడితే రానున్న రోజుల్లో దీని పర్యవసానం వేరేలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు గిరి రఘు, గొర్ల వెంకటరమణ, సింగరపు ఈశ్వరరావు, వైసిపి నాయకులు గిరి చిన్ని, కస్తూరి రామకృష్ణ, శివ, బాలాజీ, రవి, తదితరులు పాల్గొన్నారు. (Story: మంత్రి సంధ్యారాణిపై రాజన్నదొర విమర్శనాస్త్రాలు)