వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కార్పొరేట్ యాజమాన్యానికి మంత్రి లోకేష్ చెక్
నంబరు..95523 00009 నుంచి సేవలు
విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌కు అవకాశం
ప్రిన్సిపాల్ సంతకం లేకుండా పరీక్షకు అనుమతి
న్యూస్ తెలుగు/అమరావతి: ప్రస్తుతం ముగియనున్న విద్యా సంవత్సరానికిగాను మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జారీకి ఆదేశించి..కార్పొరేట్/ప్రైవేట్ యాజమాన్యానికి చెక్ పెట్టారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వారంతా వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి విద్యార్థులకు సైతం వాట్సప్ ద్వారా ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటర్ హాల్ టిక్కెట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు ఇంటర్ హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈసారి వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటర్ హాల్ టికెట్లను అందించనుంది. విద్యార్థులు వాట్సాప్ ద్వారానే నేరుగా ఈనెల (ఫిబ్రవరి) 7వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు బోర్డు వెల్లడించింది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించలేదన్న సాకుతో హాల్‌టికెట్లు ఆపేసిన సంఘటనలు నిత్యం కొనసాగుతున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విజయవాడ సమీపంలోని కానూరులో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని అర్థరాత్రి గేట్ బయటకు గెంటేసిన సంఘటన దయనీయంగా మారింది. అనంతపురం జిల్లా నారాయణ కళాశాలలో విదార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిత్యం ఈ సంఘటనలకు కారణం భారీగా ఉన్న ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేకపోవం, పరీక్షల ముందు నాటికి ఎంతోకొంత బకాయిలు ఉంటే..వాటిని కళాశాల యాజమాన్యం నిలిపేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి నారా లోకేష్ విద్యార్థులే నేరుగా వాట్సాప్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ కీలక నిర్ణయంతో ప్రైవేట్/కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి చెక్ పెట్టినట్లయింది.
వాట్సాప్‌లో..ఇంటర్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడింగ్ ఇలా..
- ముందుగా వాట్షాఫ్ గవర్నెన్స్‌కు సంబంధించిన నంబరు..95523 00009ను మన సెల్‌ఫోన్‌లో చేసి..వాట్సాప్‌లోకి వెళ్లి క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ‘మన మిత్ర (వాట్సాఫ్ గవర్నెన్స్) అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సింబల్‌తో కూడిన ఆన్‌లైన్ లింక్ వస్తుంది.
- సింబల్ కింద మన భాష ఎంపిక కోసం ఇంగ్లీషు అయితే క్యాపిటల్ ఇఎన్, తెలుగు అయితే…క్యాపిటల్ టిఇ అని క్లిక్ చేయాలి.
- అనంతరం ప్రభుత్వ శాఖను క్లిక్ చేయాలి.
- అప్పుడు వచ్చే పౌర సేవల్లో మనకు కావాల్సిన విద్యాసేవలు ఎంచుకోవాలి.
- ఇప్పటికే ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.
- ఇంటర్ ప్రథమ/ద్వితీయ సంవత్సర హాల్ టిక్కెట్ల కోసం రోల్ నంబరు/ఆథార్‌ను నమోదు చేయాలి
- అనంతరం వచ్చే బాక్స్‌లో విద్యార్థి పుట్టిన తేదీ వివరాలు నింపి..కింద భాగంలో ఉన్న నిర్థారించండీ దానిపై క్లిక్ చేయాలి.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 రకాల ప్రభుత్వ సేవలు..
ప్రస్తుతం ప్రభుత్వంతో ఒక్క డేటా వనరుల విధానం లేకపోవడంతో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో కార్యాలయాల చుట్టూ ప్రజలు నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఇంకా తగ్గలేదు. దీంతో స్మార్ట్ ఫోన్ల ద్వారానే అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందేలా సీఎం చంద్రబాబు ప్రభుత్వం అమలుకు నిర్ణయించింది. ఈ క్రమంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య గల అనుసంధాన ప్రక్రియను సమీక్షించింది. ప్రత్యేకంగా ఒక భారీ డేటాను ఏర్పాటు చేసి..అన్ని శాఖల డేటాను అనుసంధానం చేసి, పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇకపై అన్నింటిటికీ వాట్సాప్ సేవలే.. ఇకపై ప్రజలు తమకు అవసరమైన ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మెటా సంస్థతో ఒప్పందంతో కుదర్చుకుంది. ఇప్పటికే దీనిపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మెటా సంస్థ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యార్హత, కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాలను కూడా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేయడం, ప్రభుత్వానికి ఫిర్యాదులు, అర్జీలు సమర్పించడం వంటి సౌకర్యాలూ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. (Story: ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!)