పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఖిల్లా గణపురం మండల పరిధిలోని డీకే తండా శివారులోని తెలంగాణ మోడల్ స్కూల్ ను, ఘనపురం మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెండు పాఠశాలల్లో అధ్యాపకులతో కలెక్టర్ వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. మార్చి 21 నుండి పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తయిందా లేదా? విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, అనే విషయంపై సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. రివిజన్ టెస్టుల్లో విద్యార్థులకు ఏ విధమైన మార్కులు వస్తున్నాయి అనే వివరాలను తెప్పించుకొని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు గుర్తించాలని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. వెనుకబడిన విషయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రాథమిక అంశాల నుంచి వారికి బోధించాలని చెప్పారు. ముఖ్యంగా గణితం, సైన్స్, హిందీ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోర్డు పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అయ్యేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో వెంకటాచారి, ఎంఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.(Story : పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలి)