సీఎం అర్జెంట్ కాల్
వెంటనే రాజధానికి చేరుకోండి
న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం : తన మంత్రి వర్గ సహచరులకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి
అర్జెంట్ కాల్ చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నఫలంగా రాజధానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్రంలో అందుబాటులో గల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో పర్యటనలను రద్దు చేసుకుని, వాయిదా వేసుకుని మరీ హైదరాబాద్ కు పరుగు పరుగున బయలుదేరారు. దీంతో తెలంగాణాలో రాజకీయంగా ఏం జరుగుతోందనే చర్చకు దారి తీసింది.
ప్రజాపాలన బాగుందా? ఫాం హౌజ్ పాలన బాగుందా? అంటూ తెలంగాణా కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకుందనే వాదనల నేపథ్యంలో, తాజాగా తన ఫాం హౌజ్ లో కేసీఆర్ వ్యాఖ్యల పరిణామాల్లో సీఎం నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేకు అత్యవసర పిలుపు రావడం గమనార్హం. దీంతో నిన్న మధ్యాహ్నమే జిల్లాకు చేరుకున్న కొందరు మంత్రులు రాత్రికి రాత్రే రాజధానికి తిరుగుముఖం పట్టడం విశేషం. తమకు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లల్లో జరుగుతున్న శుభకార్యాలకు కూడా వెళ్లకుండా మరికొందరు మంత్రులు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు.(Story : సీఎం అర్జెంట్ కాల్)