వెంకట మాధవి హత్యకు కళ్లకు గంతలతో NFIW నిరసన
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాద్ అమీర్పేటలో వెంకట మాధవిని భర్త గురుమూర్తి ముక్కలుగా నరికి చంపడంపై భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా, పట్టణ మహిళా నేతలు కార్యకర్తలు కళ్ళకు నల్లగంతలు కట్టుకొని, ప్లకార్డులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా NFIW జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, గీత, గౌరవ అధ్యక్షులు కళావతమ్మ మాట్లాడారు. గురుమూర్తి భార్య వెంకట మాధవిని ముక్కలుగా నరికి, కుక్కర్ లో ఉడికించి పొడి చేసి చెరువులో పారబోయటం దారుణమని, ఈ సంఘటనమానవత్వానికే మచ్చ అన్నారు. మానవ మృగం గురుమూర్తికి ఉరిశిక్ష వెయ్యాలన్నారు. మహిళల హత్య, అత్యాచారాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి వెంటనే శిక్షలు వేయాలన్నారు. మహిళా నేరాల కేసులు నిందితులకు శిక్షలు పడటం లేదన్నారు. సాక్షాదారాలతో పోలీసులు నిరూపించలేక పోవటమే కారణమన్నారు. అందుకే మహిళ చట్టాలు, కేసులు అంటే నేరస్తులకు భయం లేకుండా పోయిందన్నారు. సాక్షాదారాలు కోర్టుకు సమర్పించడంలో పోలీసులు శ్రద్ధ పెట్టాలన్నారు. మహిళలను ముట్టుకుంటే చావు ఖాయమనే భయం కలగాలని అప్పుడే మహిళా నేరాలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో పరువు హత్యలు అరికట్టాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం పిల్లలమర్రి లో కులాంతర వివాహం కారణంతో కృష్ణ అనే యువకుడిని చంపినట్లు వార్తలు వచ్చాయన్నారు. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పూర్తిస్థాయి సిబ్బందితో మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకొని పక్షంలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, ప్రధాన కార్యదర్శి గీత, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు భూమిక, శిరీష, నాయకులు అంజనమ్మ, అలివేల, వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : వెంకట మాధవి హత్యకు కళ్లకు గంతలతో NFIW నిరసన)