ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
న్యూస్ తెలుగు/వనపర్తి : పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం నిర్వహిస్తున్న గ్రామసభల రెండో రోజులో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బ్రహ్మంగారి వీధిలో వార్డ్ సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ ప్రజాపాలన సందర్భంగా ప్రజలు దరఖాస్తు చేసుకోగా అట్టి దరఖాస్తులను జనవరి 16 నుండి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. రూపొందించిన జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఇంకా అర్హత ఉన్న లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రజల సమక్షంలో తెలుసుకోడానికి జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందన్నారు. ఈ జాబితాలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అనేది ప్రజల సమక్షంలో పెట్టీ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి ఈ నాలుగు పథకాలకు సంబంధించి అధికారులు గ్రామంలో సందర్శించి రూపొందించిన జాబితాలోని పేర్లను గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ చదివి వినిపిస్తున్నట్లు చెప్పారు. చదివిన జాబితాలో ఎవరైనా అర్హులు కానీ వారు ఉంటే గ్రామసభలో నే అభ్యంతరం చెప్పాలని అలాంటి వారి పేర్లు తొలగించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఉండి ఇంకా పేర్లు రాని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ నీ 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. తర్వాత మరో రెండు గ్యారంటీ లు 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరో గ్యారంటీ అయిన రెండు లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటిల్లో భాగంగా జనవరి 26న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరో 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని నిరుపేద కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంవత్సరానికి 10 వేల నుండి 12 వేల రూపాయలకు పెంచిన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించబోతున్నారనీ తెలిపారు. ఈ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే అందే విధంగా గ్రామ సభలు పెట్టీ ప్రజల ఆమోదంతో అర్హులకే లబ్ధి చేకూర్చేందుకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని, జాబితాలో పేర్లు లేవని దిగాలు పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. పేర్లు లేని వారు గ్రామ సభలో కానీ, ప్రజాపాలన సేవా కేంద్రంలో కానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసరా పెన్షన్ 2000 నుండి 4000 లకు పెంచడం, పేద మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం వంటి మరో రెండు హామీలు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన వెంటనే వాటిని సైతం అమలు చేయడం జరుగుతుందన్నారు.గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామని హామి ఇచ్చారు. 14వ వార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివిన పాఠశాల ఉందని, దాన్ని రూ. 70 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం స్వయంగా వనపర్తి వచ్చి త్వరలోనే శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందాలని గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలోనే చెప్పాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ బ్రహ్మచారి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.(Story : ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది )