అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం
వినుకొండలో వైకాపాకు గట్టి షాక్, తెదేపాలో చేరిన నలుగురు వైకాపా కౌన్సిలర్లు
చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన సమక్షంలో తెదేపాలో చేరిక
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణంలో ఉన్నామని, ఈ క్రమంలో ఎవరు కలసి వచ్చినా కలుపుకుని ముందుకు వెళ్తామని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గంజాయి, గుట్కా, గుండాయిజ, రౌడీయిజం లేని అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడమే కూటమి ప్రభుత్వ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అన్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో యువత పెడదోవ పట్టించే అనేకాంశాలు చూశామని, ఆ దుస్థితి మార్చడానికి అంతా కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అరాచక శక్తుల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. అభివృద్ధికి సహకరించే వారికి అండగా ఉంటాం. అదే నమ్మకంతో పార్టీలో చేరుతున్నవారందర్నీ అక్కున చేర్చుకుంటాం అని స్పష్టం చేశారు. వినుకొండ పురపాలక సంఘంలో బుధవారం వైకాపాకు గట్టి షాక్ తగిలింది. వైకాపాకు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జీవీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ పురపాలక సంఘంలో 32 వార్డులకుగాను వైకాపా 28 స్థానాలు, తెదేపా 4 స్థానాలు గెలిచింది. శాసనసభ ఎన్నికలకు ముందు ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. ప్రస్తుతం ఐదుగురు కౌన్సిలర్లు తెదేపా చేరడంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. 4, 11, 20, 21వ వార్డుల కౌన్సిలర్లు మహదేవ జమున ఇందుమతి, క్రిష్టం బ్రహ్మయ్య, నంది అంజలి, గర్రె శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ పులిపాటి రామారావు, నంది నరసింహారావు, 2వ సచివాలయం మహిళా కన్వీనర్ లక్ష్మీసామ్రాజ్యం, వైకాపా బూత్ కన్వీనర్ గోళ్ల రాజులు, దొంతు ఆంజనేయులు, తదితరులు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ రాష్ట్రాభివృద్ధిని గమనించి వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరినట్లు తెలిపారు. స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా అభివృద్ధే తన ధ్యేయమన్నారు . అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలుకనీవినీ ఎరగని రీతిలో 30వేల ఆధిక్యంతో గెలిపించారని, వినుకొండ టౌన్‌లో మరింత ఆదరించారన్నారు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, భావితరాలు గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రామలింగేశ్వరస్వామి ఆలయం, ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని స్పష్టం చేశారు. శాశ్వత మంచినీటి పథకానికి పరిష్కారం చూపిస్తాం. స్టేడియం, షాదీఖానా, పార్క్, తితిదే కల్యాణమండపం పూర్తి చేస్తాం. ప్రజలందరి సహకారంతో వినుకొండ పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్తాం. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికా ర్జున రావు, టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్, పి.వి.సురేష్ బాబు, షమీం ఖాన్, పత్తి పూర్ణ, పెమ్మసాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం)