7 నెలల్లో రాష్ట్రానికి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సీఎం చంద్రబాబు కృషి కారణంగానే ఇది సాధ్యమవుతోందని, పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకుని రావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఎన్డీయే ప్రభుత్వమేనని ప్రజలంతా చర్చికుంటున్నారని తెలిపారు. ఈ 7 నెలల్లోనే 5 ఏళ్ల వైకాపా – కూటమి పాలన మధ్య తేడాను అంతా గమనించారన్నారు. ప్రస్తుతం కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతంగా సాగుతుందని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో సమావేశం ఫలప్రదమైందని, ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. మంగళవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావులు మాట్లాడారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఇటు కేంద్రం నుంచి గానీ, అటు పరిశ్రమలు, పెట్టుబడుల రూపంలోగానీ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమన్నారు. వైకాపా పాలనలో విశాఖ ఉక్కును తాకట్టు పెట్టేశారని, కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోలేదని వాపోయారు. కానీ సీఎం చంద్రబాబు అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు, విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు సహా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా నిధులు తెస్తున్నారని, ఆ విషయంలో సహకరిస్తున్న ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుత దావోస్ యాత్రతో పాటు గతంలో విదేశాల్లో లోకేష్ పర్యటనలు మంచి సత్ఫలితాలను ఇస్తుందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచి మలుపు అని అభిప్రాయపడ్డారు. దూరదృష్టితో చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. కచ్చితంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించుకుంటామన్నారు. ఇదే సమయంలో వినుకొండలోని నరసరావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డు, కారంపూడి రోడ్డులో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లు నిర్మిస్తామని తెలిపారు. శరవేగంగా అర్బన్ హౌసింగ్ స్కీమ్ పూర్తవుతుందన్నారు. రామలింగేశ్వరస్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారన్నారు. త్వరలోనే ఘాట్ రోడ్డు పనులు కూడా చకచకా పూర్తి చేస్తామని, రూ.150 కోట్ల మంచినీటి పథకాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. సమర్ధవంతమైన కమిటీతో కొండపైన రామలింగేశ్వరస్వామి గుడి నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు పి.అయూబ్ ఖాన్, పీవీ సురేష్ బాబు, షమీంఖాన్ పాల్గొన్నారు. (Story : 7 నెలల్లో రాష్ట్రానికి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు)