మహాద్యమ అబూజ్ మాడ్ కాల్వపల్లి
– సాయుధ విప్లవోద్యమానికి అప్పటి కే ఆఫ్ అడ్రస్
– మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు
– ఊదంతాంతో మరోసారి వెలుగులోకి
న్యూస్ తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం : సాయుధ విప్లవోద్యమానికి ఆనాటి కేరాఫ్ అడ్రస్, తెలంగాణ కీకారణ్య అబూజ్మాడ్ కాల్వపల్లి. కాకతీయ సామ్రాజ్య చారిత్రక వరంగల్ నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో గల ఒకప్పటి కీకారణ్య పల్లె. సాయుధ విప్లవోద్యమ చరిత్ర పుటల్లో కాల్వపల్లికి ప్రత్యేక పేజీలు ఉన్నాయి. ఈ పల్లె తాజాగా ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ స్వగ్రామమే కాల్వపల్లి. ఈనెల 16న ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా పూజరి కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో దామోదర్ మరణించినట్లు మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటన విడుదలైంది. అయితే ఈ వార్తను ఇటు తెలంగాణా, అటు ఛత్తీస్ గఢ్ పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదనేది వేరే విషయం. ఇక అసలు విషయంలోకి వస్తే…
ఒకప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీకి కాల్వపల్లి శత్రు దుర్భేద్యకోటగా అభివర్ణించవచ్చు. ఓరకంగా చెప్పాలంటే మావోలకు ‘తెలంగాణా అబూజ్ మడ్’ ఈ పల్లె. మూడున్నర దశాబ్దాల క్రితం 1990వ దశకం యావత్తూ కాల్వపల్లి అన్నల ప్రాణాలకు ఢోకాలేని షెల్టర్ జోన్. నెలల తరబడి ఇక్కడ సాయుధ దళాలు మకాం వేసినా నాలుగు కిలోమీటర్ల దూరంలో గల నార్లాపూర్ పోలీస్ స్టేషన్ కు కించిత్ సమాచారం కూడా తెలిసేది కాదంటే కాల్వపల్లిలో నక్సలైట్లకు గల పట్టును అర్థం చేసుకోవచ్చు.
కాల్వపల్లి గ్రామం..
మహదేవపూర్ నుంచి ఏటూరునాగారం వరకు దళాన్ని నిర్వహించిన జనార్థన్ నుంచి జంపన్న వరకు కాల్వపల్లిలో వారాల తరబడి షెల్టర్ తీసుకున్న పరిస్థితులు అనేకం. మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా ఎదిగిన బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్, బడే మురళి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తదితరులు కాల్వపల్లికి చెందినవారే. కాల్వపల్లి అంటేనే అన్నల ఊరు అనే పేరు అప్పట్లో ఉండడానికి కారణాలు అనేకం. గ్రామంలో అప్పటి పీపుల్స్ వార్ కు కనీసంగా సానుభూతిపరుడు లేదా మిలిటెంట్ కాని వ్యక్తులెవరూ ఈ ఊళ్లో ఎవరూ లేరని పోలీసు అధికారులు నిర్వచిస్తుండేవారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో విసిరేసినట్లు ఉండే కాల్వపల్లి గ్రామం చుట్టూ ఓ వాగు వలయాకారంలో ఉంటుంది. వర్షాకాలంలో ఈ వాగు దాటాలంటే సాహసమే చెప్పాలి. మోకాలి లోతు నీటి ప్రవాహంలోనూ మనుషులు కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. వాగులో నీటి ప్రవాహ ఉధ్రుతికి ఆయా ఘటనలు నిదర్శనం. వాగు దాటి ఊళ్లలోకి ప్రవేశించే పరిస్థితులు వర్షాకాలంలో మృగ్యం. గ్రామానికి ఎగువ భాగాన గల గుట్టలు మరింత సురక్షితం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండడం కూడా కాల్వపల్లి ప్రత్యేకత. మూడున్నర దశాబ్దాల క్రితమే కాల్వపల్లి పక్కనే గల నార్లాపూర్ లో పోలీస్ స్టేషన్ ఉండేది. కానీ కాల్వపల్లికి వెళ్లాలంటే పోలీసులు భీతిల్లేవారు. సాహసించి కాల్వపల్లి వరకు వెళ్లి తిరిగి వస్తున్న పోలీసులపై నక్సల్స్ దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతంలో అప్పటి పీపుల్స్ వార్ ప్రాబల్య తీవ్రతవల్ల తమకు రక్షణ లేదనే కారణంతో నార్లాపూర్ లోని పోలీస్ స్టేషన్ నే ఎత్తివేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పార్టీలో సహచరితో బడే చొక్కారావు ///
గుర్తున్నంత వరకు.. అప్పట్లో నార్లాపూర్ పోలీస్ స్టేషన్ ను పేల్చేందుకు కూడా నక్సలైట్లు విఫలయత్నం చేశారు. వందలాదిగా వచ్చిన నక్సల్స్ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి మందుపాతరలు అమర్చారు. పేల్చడానికి అసరమయ్యే తీగ సరిపోకపోవడంతో ఈ ప్రయత్నం అప్పట్లో విఫలమైంది. దీంతో ఠాణాలో గల పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లు అప్పట్లో జరిగిన ఉదంతంపై భిన్నకోణాల్లో స్థానికులు చెబుతుంటారు. కాల్వపల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గల మేడారం చెరువు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య 1991 ప్రాంతంలో ఓ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో అప్పటి పీపుల్స్ వార్ ఏటూరునాగారం ఏరియా దళ కమాండర్ జంపన్న భార్య శారదక్క సహా మరికొందరు నక్సల్స్ మరణించారు. ఈ కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్ పరుగున వెళ్ళి కాల్వపల్లి పక్కనే గల ఊరట్టం గ్రామంలో గల జంపన్నకు, ఆయన నాయకత్వంలోని దళానికి విషయాన్ని చెప్పారు.
ఎన్కౌంటర్ వంటి సంఘటనలే కాదు.., మరే ఉపద్రవం ముంచుకొచ్చినా నక్సలైట్లకు ఛత్తీస్ గఢ్ లోని ‘అబూజ్ మడ్’ తరహాలోనే కాల్వపల్లి షెల్టర్ జోన్ గా ఉపకరించేది. కాలక్రమంలో ఈ గ్రామానికి చెందిన బడే నాగేశ్వర్ రావు, మురళి వంటి నక్సల్ నాయకులతోపాటు సాధారణ సభ్యులు పలువురు ఎన్కౌంటర్లలో మరణించగా, మిలిటెంట్లు, సానుభూతిపరులు జనజీవన స్రవంతిలో కలిశారు. తాజా ఉదంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణవార్త కూడా ధ్రువపడితే విప్లవోద్యమ చరిత్రలో కాల్వపల్లి గ్రామంలో మరోసారి విషాదఛాయలు అలుముకున్నట్లుగానే చెప్పవచ్చు. కాగా కాల్వపల్లి గ్రామంలోనే కాదు, మేడారం సమీపిస్తుండగా ఊరట్టం గ్రామం వెళ్లేదారి ప్రారంభంలో, మూలమలుపున గల భారీ స్థూపాలు అప్పట్లో అన్నల ప్రాభవాన్ని గుర్తు చేస్తున్నట్లుగా సాక్షాత్కరిస్తాయి. (Story : మహాద్యమ అబూజ్ మాడ్ కాల్వపల్లి)
పి. సత్య ఆనంద్
భద్రాద్రి కొత్తగూడెం