ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది సీఎం చంద్రబాబు ఒక్కరే
డూండి రాకేష్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మాత్రమే అని గర్వంగా చెప్పగలమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయని, కానీ ఆర్యవైశ్యులు గురించి ఎవరూ ఆలోచించలేదని, సీఎం చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వం వారిని గుర్తించారని, చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విజయవాడ గాంధీజీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా డూండి రాకేష్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మంత్రి సవిత, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, కాలవ శ్రీనివాసులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డూండి రాకేష్‌ను జీవీ ఆంజనేయులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం జీవీ మాట్లాడుతూ డూండీ రాకేష్ లోకేష్ యువగళం పాదయాత్రలో వెన్నంటి ఉండి బాధ్యతగా సేవ చేశారన్నారు. అర్ధరాత్రి కూడా తమకు ఫోన్ చేసి సమన్వయం చేశారని, అంత బాధ్యత, క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తికి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంటే పెద్ద కోటీశ్వరులు, లక్షాధికారులనని భావిస్తూ ఉంటారని, కానీ వారిలో వేల కోట్లు ఉన్నవాళ్లు ఉన్నారని, ఇంటి విద్యుత్ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితితో పాటు ఆకలిబాధతో ఉన్నవాళ్లు కూడా ఉన్నారన్నారు. అందుకే సెంటు భూమి కూడా లేనివాళ్లు ఆర్యవైశ్యుల్లో ఉన్నారని గుర్తించి ఆనాడు సీఎం చంద్రబాబు ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కానీ ఒక్క అవకాశమంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్లు ఆర్యవైశ్యులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్యవైశ్యులంటేనే దానాల్లో ముందుంటారని, వాసవీ ట్రస్టు ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేద విద్యార్థులకు ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించి చదివిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.(Story : ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది సీఎం చంద్రబాబు ఒక్కరే )