తరగతి గదుల్లోనే రాష్ట్ర, దేశ భవిష్యత్ తీర్చిదిద్దుతాం
వినుకొండ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు/ వినుకొండ : రాష్ట్రం, దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే తీర్చిదిద్దాలనే బృహత్ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకోసమే విద్యార్థులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు ఇంటర్ స్థాయిలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుని వచ్చామన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జూనియర్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. వైసీపీ పాలనలో అన్న క్యాంటీన్ల తరహాలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తొలగించారని మండిపడ్డారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో బాధపడ్డారని, గ్రామాల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే వారు మధ్యాహ్నం భోజనం లేక అల్లాడారన్నారు. వారికోసం 2018లోనే నాటి తెదేపా ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారని, వైసీపీ పాలనలో తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలి బాధ, చదువు విలువ తెలియని జగన్‌రెడ్డి.. పేద విద్యార్థుల నోటికాడ కూడు తీసేయడం ఆనాడు ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు చేస్తున్నారని, ఏడాదికి సుమారు రూ.86 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చడానికే ప్రభుత్వం ఈ పథకం తిరిగి అమలు చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు తొలగించిందని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కు రాయితీపై వచ్చే పథకాలన్నీ తీసేసిందన్నారు. సీఎం చంద్రబాబు అవన్నీ పునరుద్ధరించి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,139 పాఠశాలల్లో 33.81 లక్షలమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. నాటి వైకాపా పాలనలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుని పోతే, నేడు ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం నిధులిచ్చి తోడ్పాటుని అందిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రతి ప్రభుత్వ కళాశాల , ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తరగతి గదుల్లోనే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నంబర్-1గా తీర్చిదిద్దుతామన్నారు. ఇంటర్ విద్యార్థులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ వచ్చాక తీసేశారని, ఉదయాన్నే కళాశాలలకు హడావుడిగా పరుగులు తీయడం వల్ల భోజనం కుదరడం లేదని కొంతమంది విద్యార్థులు చెప్పారని అన్నారు. అలానే ఆర్టీసీ బస్సులు లేవంటే డిపో మేనేజర్లతో మాట్లాడి కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, జూనియర్ కళాశాలలో మంచి మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్ తరఫున ప్రతిభ ఉపకారవేతనాలు కూడా అందిస్తామన్నారు. ఉన్నత ఆశయాలు, భావాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు జీవీ ఆంజనేయులు తెలిపారు. (Story : తరగతి గదుల్లోనే రాష్ట్ర, దేశ భవిష్యత్ తీర్చిదిద్దుతాం)