ముంపు భాధితుల సమస్యలు పరిష్కరించండి
– జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
న్యూస్‌తెలుగు/చింతూరు : పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితుల భూ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్, చింతూరు ఆర్ అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల భూ సమస్యలు పరిష్కారం గూర్చి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చింతూరు డివిజన్లోని కూనవరం, చింతూరు, ఏటపాక, విఆర్ పురం మండలాలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాటు చేసే విధంగా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములను రైతులకు చూపించాలని సూచించారు. దేవీపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబంధించిన బాధితులకు స్మశాన వాటికలు ఉన్నది లేనిది గుర్తించి భూ సేకరణ చేయాలని, అందులో స్మశాన వాటికల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా గిరిజనేతరులకు గోకవరంలో భూములు కేటాయింపు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచల౦, రంపచోడవరం సబ్ కలెక్టర్ కె ఆర్. కల్ప శ్రీ , ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ వందనం, చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, వేదవల్లి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : ముంపు భాధితుల సమస్యలు పరిష్కరించండి)