దేశ అభివృద్ధి ప్రయాణంపై
మన్మోహన్ సింగ్ చెరగగని ముద్ర
మాజీ ప్రధాని మృతి పట్ల ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంతాపం
న్యూస్ తెలుగు / వినుకొండ : దివాలా అంచుల నుంచి ఆర్థిక రంగాన్ని కాపాడడంతో పాటు తిరిగి అభివృద్ధిలో పరుగుపెట్టించడం , ఆ ఫలాలు ప్రజలకు చేరవేయడం ద్వారా దేశాభివృద్ధి ప్రయాణంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెరగనిముద్ర వేశారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే ముూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ పరుగులు తీస్తోందంటే అందుకు బీజం వేసింది మన్మోహన్ సింగ్ అంటూ ఘన నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై శుక్రవారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. భారతదేశ 14వ ప్రధానమంత్రిగా దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మన్మోహన్ సింగ్ దేశం సాధించిన సగటు వృద్ధి, సంస్కరణల ఫలితా లను ప్రపంచమంతా ప్రశంసించిందన్నారు. మరీ ముఖ్యంగా 1991 ఆర్థిక సంస్కరణలు, లైసెన్స్ రాజ్‌కు చరమగీతం పాడడం ద్వారా నేటి నవభారతానికి ఆ నాడే కొత్తరెక్కలు అందించిన దార్శ నిక ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మన్మోహన్ అన్నారు. పంజాబ్, దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆర్థిక పాఠాలు చెప్పే స్థాయి నుంచి మితభాషి, మృదుభాషిగానే అద్భుతాలు సాధించిన మన్మోహన్ సింగ్ జీవితం నేటితరానికి ఆదర్శమని కొనియాడారు. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి చదువే ఆలంబనగా అంచలంచెలుగా ఎదిగి అత్యున్న శిఖరాలకు ఎలా చేరొచ్చు అనడానికి మన్మోహన్‌సింగ్ ఒక స్ఫూర్తి పాఠమన్నారు.(Story ; దేశ అభివృద్ధి ప్రయాణంపై మన్మోహన్ సింగ్ చెరగగని ముద్ర)