వైసిపి కార్యకర్తల పై దాడులు ఆపాలి..
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ నియోజకవర్గంలో వైసిపి నాయకులు కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న దాడులను అడ్డుకొని పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. కూటమి నాయకులు వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను, గ్రామాల్లో యాక్టివ్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు చేసిన వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎక్కడ వైసిపి ఫ్లెక్సీలు లేకుండా కూటమి నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని, ఫ్లెక్సీ కట్టిన వైసీపీ నాయకుడిపై దాడి చేసి చేయి విరకొడితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా చేసిన వాళ్లని పోలీస్ స్టేషన్లో నిర్భందించారని అన్నారు. తన పిఏ శివ పై కక్ష కట్టిన టిడిపి నాయకులు గురువారం రాత్రి అతని ఇంటి పైకి వెళ్లి దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. పాలన అభివృద్ధిని పక్కనపెట్టి కూటమి నాయకులు లక్షసాదింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. దాడులు దౌర్జన్యాలు ఆపి వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నేతలు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు. (Story : వైసిపి కార్యకర్తల పై దాడులు ఆపాలి.. )