అమృత్, జల్‌జీవన్ ద్వారా త్వరలోనే ఇంటింటికీ మంచినీరు
వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో జీవీ ప్రజా దర్బార్, వెల్లువెత్తిన వినతులు
న్యూస్ తెలుగు / వినుకొండ : అమృత్, జల్‌జీవన్ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించే బృహత్ కార్యాన్ని త్వరలోనే నెరవేర్చబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. జగన్ రూ.10.50 లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయినా ఆ వడ్డీలు, వాయిదాలు కడుతూనే సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సీఎం అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్ మాఫియాలపై ఉక్కుపాదం మోపడమే అందుకు నిదర్శనం అన్నారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలు వింటూ భరోసా కల్పించారు. వాటిపై పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రజదర్బార్‌కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం వైకాపా అయిదేళ్ల పాలన అరాచకాలపైనే ఉండడం జగన్ మాఫియారాజ్‌కు ఉదాహరణగా చెప్పారు. ప్రజా సమస్యలు, భూకబ్జాల కేసులు, భూదురాక్రమణలు, సహా కోకొల్లలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వినుకొండలోనూ అధికారుల్నే బెదిరించి మాఫియా నడిపారని, తమ స్థలాలు లాక్కున్నారని వాపోతున్నారని అన్నారు. ఇదే సమయంలో అధికారులంతా గంజాయి, మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని భావితరాలకు అందించాలన్నదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. విజన్-2047 నాటికి ప్రతీ కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఇంటికో ఉద్యోగం, తలసరి ఆదాయం రూ.30 లక్షల కు పెంచడం, ఆరోగ్యాంధ్రప్రదేశ్‌అన్నీ సాకారం అవుతాయన్నారు. ఇందుకు విరుద్ధంగా జగన్ సొంత ఆస్తులు పెంచుకున్నారు గానీ ఎప్పుడైనా ఇలా ప్రజా దర్బార్‌లు పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించారా అని ప్రశ్నించారు. 2014-19లో వచ్చిన వాటి టిడ్కో ఇళ్లల్లో జగన్ 2 లక్షల ఇళ్లు రద్దు చేశారని, లక్షలాది ఇళ్లు పూర్తి చేయకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వినుకొండ పట్టణం భవిష్యత్‌లో 20 లక్షల జనాభా స్థాయికి చేరనుందని, అదే స్థాయిలో మౌలిక వసతులు పెంచుతామన్నారు. బస్ షెల్టర్ల నిర్మాణం చేపడుతున్నామని, శివశక్తి ఫౌండేషన్, పురపాలక సంఘం సౌజన్యంతో 4 చోట్ల బస్ షెల్టర్లు నిర్మిస్తామని, ప్రజా మరుగుదొడ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. 2మురుగు నీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేయించామని, మురుగునీరు వాగుల్లో, తాగునీటిలో కలిసి కలుషితం కాకుండా శుద్ధి చేస్తామన్నారు. అమృత్ పథకం కింద ఇంటింటికీ మంచినీటిని అందించేలా శాశ్వత తాగునీటి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్లు, ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తామని, ఇళ్ల స్థలాలు లేనివారికి కూడా ప్రభుత్వం ద్వారా భూసేకరణ చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత తెదేపా హయాంలో వినుకొండో అర్బన్ హౌసింగ్ పథకం కింద 4,020 ఇళ్లు తీసుకొస్తే వాటిలో 2 వేలకుపైగా ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వాటిని మళ్లీ తీసుకొచ్చి పేదలకు నిర్మించి ఇస్తామన్నారు. ఎన్నెస్పీ మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని, కొండ మీద గుడి అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.2 కోట్లు ఇచ్చారని, తితిదే కల్యాణ మండపానికి రూ.3 కోట్లు, షాదీఖానాకు రూ.3.50 కోట్లు మంజూరు చేశారన్నారు. వాటికి మాస్టర్ ప్రణాళిక సిద్ధం కావడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. (Story : అమృత్, జల్‌జీవన్ ద్వారా త్వరలోనే ఇంటింటికీ మంచినీరు)