Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ ఆదర్శంగా నిలవాలి

పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ ఆదర్శంగా నిలవాలి

0

పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ ఆదర్శంగా నిలవాలి

వినుకొండ పుర సమస్యలపై ఫిర్యాదుకు గ్రీవెన్స్ నెంబర్ ఆవిష్కరించిన జీవీ, మక్కెన

న్యూస్‌తెలుగు/ వినుకొండ : పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ పట్టణం ఆదర్శంగా నిలవాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. ప్రజాఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి వేగంగా పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు. వినుకొండ పట్టణ ప్రజలకు పురపాలక సంఘం ద్వారా సమర్ధ సేవలు అందించడం, జవాబుదారీతనం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ 9933585666 ను ఏర్పాటు చేశారు. ఆ గ్రీవెన్స్ నెంబర్‌కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆవిష్కరించారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో మరమ్మతులకు గురైన వీధి దీపాలతో పాటు కొత్తవాటిని ఎమ్మెల్యే జీవీ పరిశీలించారు. పాడైపోయిన వీధి దీపాలకు మరమ్మతులు చేస్తున్నారు. తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ పురపాలక సంఘం కమిషనర్‌గా సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత పట్టణంలో పనులన్నీ వేగంగా సాగుతున్నాయన్నారు. సెంట్రల్ లైటింగ్ దీపాలకు మరమ్మతులు చేయించి దీపావళి నాటికి అమర్చి బాగా వెలిగించేలా చర్యలు చేపట్టారన్నారు. వీధి దీపాలు లేనిచోట కొత్తవి ఏర్పాటు చేస్తారని తెలిపారు. రోడ్లపైకి ఆవులు రావడంతో కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వాటికి కూడా గాయాలు అవుతున్నాయన్నారు. దానికి పరిష్కారంగా పట్టణంలోని ఆవులను ఒకచోటకు చేర్చి సంరక్షణ చేస్తామని చెప్పారన్నారు. క్లీన్ అండ్ గ్రీన్‌లో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మున్సిపల్ కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ద్వారా చేయగలిగినవి, మున్సిపాలిటీ ద్వారా తీర్చగలిగిన వాటి కోసం గ్రీవెన్స్ నెంబర్ తీసుకొచ్చారని, ఈ సేవలను పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు వినుకొండలో సెంట్రల్ లైటింగ్ బల్బులు మాడిపోయినా వేసిన దాఖలాలు లేవని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతిరోజూ దీపాలు ధగధగలాడేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ మాట్లాడుతూ వీధి దీపాలు, తాగునీటి సమస్యలు, పైపులైన్ లీకేజీ, శానిటేషన్ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న వారు పేరు, చిరునామాతో 9933585666కు వాట్సాప్ మాత్రమే చేయాలని సూచించారు. గ్రీవెన్స్ నెంబర్‌కు వచ్చిన సమస్యలను 24 గంటల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సలహాలు, సూచన మేరకు ఈ గ్రీవెన్స్ నెంబరు ఏర్పాటు చేశామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామన్నారు. (Story : పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ ఆదర్శంగా నిలవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version