సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్‌తెలుగు/ పల్నాడు జిల్లా; వినుకొండ: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వాడ వాడలా 100 సంవత్సరాల ఉత్సవాలు జరపాలనే జాతీయ సమితి పిలుపుమేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పార్టీ శాఖలలో ఘనంగా శత వార్షికోత్సవాలు నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. గురువారం నాడు సాయంత్రం 6 గంటలకు వినుకొండ పట్టణంలోని అజాద్ నగర్ కాలనీ పి.వి. శివయ్య డివిజన్లో కనిగిరి కోటయ్య అధ్యక్షతన జరిగిన శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కుల మత వర్గ విచక్షణ లేని సమాజం కోసం పోరాడిందని అన్నారు. ఆనాడు జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలను రద్దు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య పెత్తం దారులు పేద రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు పోరాటం సాగించి విజయం సాధించిందని, దొరల పంచన జీత గాడి జీవితాన్ని అనుభవించిన బడుగు జీవులకు అండగా నిలబడి పోరాటాలకు సిద్ధం చేసిందని. తెలంగాణ పోరాటంలో గ్రామీణ పేదలను ఐక్యం చేసి నిజాం నిరంకుశ సైన్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిందని ఆనాడు భూస్వాములు అనుభవిస్తున్న పేదల భూములు 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర సిపిఐ దన్నారు. కేంద్ర పెద్దలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న శక్తులు మతోన్మాదంతో పెచ్చరిల్లిపోతున్న నేపద్యంలో మరోసారి మత ఉన్మాదాన్ని పెరిగిపోకుండా భిన్నత్వంలో ఏకత్వంగా అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్న మనదేశంలో అందరినీ గౌరవించే విధానాన్ని కొనసాగించుటకు, దేశంలోని వామ పక్షవాదులను,లౌకిక శక్తులను ఇండియా కూటమిగా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఏర్పాటు చేస్తోందని దానికి ప్రజలు మద్దతు పలకాలని అన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ ఇచ్చిన పిలుపులలో పాల్గొనుచు నియోజకవర్గంలోని అనేక సమస్యలను పరిష్కరించుకొనుచు పులుపుల వెంకట శివయ్య స్ఫూర్తితో ఎర్రజెండా నీడలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో సిపిఐ అనేక పోరాటాలు చేసిందని పార్టీ ఇచ్చిన పిలుపులో భూమికోసం భుక్తి కోసం శ్రమజీవుల బడుగు జీవుల సమస్యల పరిష్కారం కోసం వారి ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు మౌలిక సమస్యల పరిష్కారంకొరకు అనేక పోరాటాలు చేసి అనేక పోలీసు కేసులు ఎదుర్కొని ప్రజలకు వేలాదిమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారి మౌలిక సమస్యలపై పోరాడి విజయం సాధించిన చరిత్ర సిపిఐ దన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొనుచు సిపిఐ నాయకత్వం ముందుకు సాగుతుందని ఆజాద్ నగర్ కాలనీ ఇళ్లపట్టాలు మంచినీళ్లు కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకొనవలసి ఉందని ఎర్రజెండా మన నియోజకవర్గంలో జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రామయ్య, కనికరపు కోటీశ్వరావు, తమ్మిశెట్టి ఆంజనేయులు, నాగేశ్వరరావు, గంజి సరోజిని, జట్ల రమణమ్మ, లాజరు సాంబయ్య, కె. మల్లికార్జున, పి. వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, సరోజనమ్మ కమలమ్మ, శాఖ సభ్యులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story : సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి)