రాప్తాడు నియోజకవర్గ వరద బాధితులను ఆదుకోండి
కనగానపల్లి చెరువు మరమ్మతులకు రూ.50 లక్షలు నిధులు ఇవ్వండి
జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి
కనగానపల్లి చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో
అనుకోకుండా వచ్చిన వరదలతో రాప్తాడు నియోజకవర్గంలో పంటలకు అపార నష్టం వాటిల్లిందని, అలాగే చాలామందికి ఇళ్లు కోల్పోయారని.. వారందరినీ ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కనగానపల్లి మండల కేంద్రంలో తెగిపోయిన (బ్రీచ్) సాగునీటి చెరువును, చెరువు క్రింద దెబ్బ తిన్న వరి పంటను, పంట పొలాలను, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పరిశీలించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఆర్.డి.ఓ. మహేష్, జలవనరుల శాఖ ఎస్.ఈ.విశ్వనాధ్ ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ తదితర అధికారులతో పంటలను, తెగిపోయిన చెరువును పరిశీలించారు. గ్రామస్తులతో పాటు పంటలు కోల్పోయిన రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. కనగానపల్లి చెరువు మరమ్మతులకు మొత్తం 50 లక్షల రూపాయల వరకు అవుతుందని ఈ నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే సునీత వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ వర్షాలు వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు కోల్పోయారన్నారు. వీటన్నింటికీ పరిహారం వచ్చే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని.. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లామని వివరించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ రెడ్డివారికుంట కెపాసిటీ మొత్తం 21 వేల క్యూసెక్కులు అని అయితే ఒక్కసారిగా 30వేల క్యూసెక్కుల నీరు రావడంతో తెగిపోయినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఐదు గంటల్లోనే 1900 మిల్లీమీటర్ల వర్షం కురవడం వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా కనగానపల్లి మండలంలో 188 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని..అందుకే చెరువు తెగినట్లు వివరించారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు తగిన ఆదేశాలిచ్చామని.. శాశ్వత ప్రాతిపదికన చెరువుకు పరమతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేష్, తాసిల్దార్ రమాదేవి, జల వనరుల శాఖ ఎస్ ఇ. విశ్వనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వైవి సుబ్బారావు, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, స్థానిక ప్రజలు, రైతులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story : రాప్తాడు నియోజకవర్గ వరద బాధితులను ఆదుకోండి)