చేత కాకపోతే వెంటనే పదవులు వీడండి
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు కొరవడిన రక్షణ
వరసగా అత్యాచారాలు, హత్యా ఘటనలు
అయినా పట్టించుకోని ప్రభుత్వం. ఎంతో నిర్లక్ష్యం
బాలకృష్ణ షో లో సీఎం. షూటింగ్స్‌లో పవన్‌కళ్యాణ్
టీవీ ప్రొగ్రామ్ రికార్డింగ్ కోసం హైదరాబాద్‌కు బాబు
కానీ, బద్వేల్ యువతి కుటుంబాన్ని మాత్రం కలవలేదు
వైయస్సార్‌సీపీ నాయకులు, నేతలపై కక్ష సాధింపు
అదే పనిగా తప్పుడు కేసులు నమోదు. వేధింపులు
అందు కోసం పోలీసులను వాడుకుంటున్నారు
ఈ చర్యతో పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేశారు
ప్రభుత్వ చేతిగానితనం వల్లే రాష్ట్రంలో అరాచకాలు
నేరస్తులు భయం లేకుండా చెలరేగిపోతున్నారు
మహిళల రక్షణపై ఇకనైనా బాధ్యతగా ఉండాలి
లేకపోతే ప్రజలతో తగిన బుద్ధి చెప్పిస్తాం
చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్‌కె రోజా ప్రెస్‌మీట్
న్యూస్‌తెలుగు/నగరి/ చిత్తూరు జిల్లా :
రాష్ట్రంలోని బాలికలు, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమ్ మంత్రి అనిత.. తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని మాజీ మంత్రి ఆర్‌కె రోజా సవాల్ చేశారు. రియాల్టీషోలు, షూటింగ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే, రాజకీయాల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు నెలల్లో బాలికలు, మహిళలపై దాదాపు 120 దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయంటే, వారి రక్షణ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవాలని రోజా అన్నారు.
కూటమి ప్రభుత్వం మహిళల రక్షణలో ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. బద్వేలులో యువతిపై అత్యాచారం చేసి దారుణంగా తగలబెట్టడంతో పాటు, తెనాలిలో యువతిపై యువకుడి దాడి, అత్యాచారంతో ఆ యువతి బ్రెయన్‌డెడ్ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, పట్టించుకోని సీఎం స్పెషల్ ఫ్టైట్‌లో హైదరాబాద్ వెళ్లి, తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టీవీ షో రికార్డింగ్‌లో పాల్గొనడం అమానవీయతకు పరాకాష్ట అని అభివర్ణించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేసిన వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతామని ఎన్నికల ముందు బీరాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు ఆడపిల్లలు లేకపోయినా, డిప్యూటీ సీఎం, హోం మంత్రికి ఆడ పిల్లలు ఉన్నందున కనీసం మనస్సాక్షితో ఆలోచించాలని ఆమె హితవు పలికారు.
రాష్ట్రంలో వరుసగా దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా, పాలకులు పట్టించుకోక పోవడంతోనే నేరస్తుల్లో ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా పోయి, ఈ ఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయని రోజా స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడిన ఆమె, టీడీపీ ఆఫీసుపై ఏదో జరిగిందని సీఐడీ దర్యాప్తు చేయిస్తోన్న ప్రభుత్వం, మహిళలపై ఇన్ని దారుణాలు జరిగినా సరే ఒక్క కేసులోనైనా సరే విచారణకు ఆదేశించ లేదని నిలదీశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యసస్థను కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారు తప్ప, శాంతిభద్రతల రక్షణ కోసం కాదని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింపచేసి, అమలు చేయాలని మాజీ మంత్రి కోరారు. అదే విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు పునరుద్ధరించాలని సూచించారు. బాలికలు, మహిళల రక్షణపై ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ చూపకపోతే, ఊర్కోబోమని, ప్రజలతో తగిన బుద్ధి చెప్పిస్తామని రోజా హెచ్చరించారు. (Story : చేత కాకపోతే వెంటనే పదవులు వీడండి)