గాంధీ మార్గం అన్నివేళలా ఆచరణీయం
గాంధీ కలలు కన్న స్వచ్చ భారత్ ను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో ఆధునిక మారణాయుధాలు కలిగిన బ్రిటిష్ వారితో ఎదురు వెళ్లి అదే ఆయుధాలతో పోరాటం చేయడం వల్ల ఫలితం ఉండదని గ్రహించిన గాంధీ అహింసా వాదంతో తిరుగులేని ఆయుధాన్ని బ్రిటిష్ వారిపై ప్రయోగించి, వారు ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటూ చాలా చాకచక్యంగా స్వాతంత్రాన్ని సంపాదించారని ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కార్యాలయాల సమీకృత భవన ప్రాంగణంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమాజం ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశించిన గాంధీజి కన్న కలలు సహకారం అవుతున్నాయని ఆయన అన్నారు . ప్రశ్నించడానికి భయపడే ఆనాటి సమాజంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి శాంతియుతంగా అహింసా మార్గంలో నడిపించి బ్రిటీష్ వారిలో వణుకు పుట్టించిన గాంధీ ఆలోచన విధానం నేటికీ విశేషంగానే చెప్పబడుతుందని ఆయన అన్నారు. అనంతరం డాక్టర్ కే.వి.ఆర్ వీరయ్య మహాత్మ గాంధీ పై రచించిన ఆత్మకథ లేక సత్యశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక రచయిత కమటం వీరయ్యను శాలువా తో సత్కరించారు. అదనపు కలక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా అధికారులు, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ సిబ్బంది బాపూజికి నివాళులర్పించారు. (Story : గాంధీ మార్గం అన్నివేళలా ఆచరణీయం)