జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీ గేమ్స్ ఇండోర్ స్టేడియం
జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించిన శాప్ ఎండీ గిరీశ
పారా క్రీడల్లో భాగంగా – రైఫిల్ షూటింగ్ లో క్రీడాకారుడిగా పాల్గొని ఉత్సాహం నింపిన ఎండీ
న్యూస్‌తెలుగు/విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లాలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సును నిర్మించేందుకు, కొమ్మాదిలో మల్టీ గేమ్స్ ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్ ఛైర్మన్, ఎండీ గిరీశ పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న పారా క్రీడలను పరిశీలించేందుకు, ఆడేందుకు ఆదివారం విశాఖపట్టణం వచ్చిన ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో రైల్వే స్టేడియం వద్ద జరుగుతున్న స్విమ్మింగ్ పోటీలను, వైఎంసీఏ వేదికగా జరుగుతున్న రైఫిల్ షూటింగ్ పోటీలను పరిశీలించారు. తను కూడా పారా క్రీడాకారుడిగా పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. వైఎంసీఏలో జరిగిన షూటింగ్ పోటీలో క్రీడాకారుడిగా భాగస్వామ్యమై రైఫిల్ చేత బట్టి తన ప్రతిభను చాటారు.
పాండురంగాపురం క్రీడాప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తో కలిసి వీక్షించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించిన వారు క్రీడాకారులకు పురస్కారాలు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. జిమ్నాస్టిక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ అందరికీ అండగా నిలుస్తామని, జిమ్నాస్టిక్ క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని రకాల వసతులూ సమకూరుస్తామని చెప్పారు. క్రీడాకారుల విన్యాసాలను ఆసాంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో వారిని అభినందించారు.
జిల్లా పర్యటనలో భాగంగా శాప్ ఎండీ గిరీశ, జిల్లా కలెక్టర్ తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. విభిన్న ప్రతిభావంతులకు క్రీడా మైదానం కోసం స్థలం గుర్తింపు, గంభీరం, రుషికొండ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి, కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీ గేమ్స్ ఇండోర్ స్టేడియం నిర్మించాలని, జిల్లాను క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉందని శాప్ ఎండీ కలెక్టర్ తో చర్చించారు. సంబంధిత చర్యలు చేపట్టాలని, అన్ని రకాల సాంకతిక ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాలోని క్రీడారంగ పరిస్థితి, అవకాశాల గురించి కలెక్టర్.. శాప్ ఎండీకి ఈ సందర్భంగా వివరించారు.
పర్యటనలో వారి వెంట జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి జూన్ గ్యాలియెట్, ఇతర అధికారులు, కోస్టల్ జిమ్నాస్టిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.