ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు
వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి
పూల మాలలు వేసి నివాళులు అర్పించిన..జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు : భూమి కోసం,భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన,పోరాటంలో నిప్పుకణికగా నిలిచి, ఆడది అబల కాదు,సబల అని నిరూపించిన వీరనారి చాకలి ఐలమ్మ ,గొప్ప పోరాట యోధురాలు, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ, 129 వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ,129వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ గారని అన్నారు. దొరల దాష్టీకానికి ఎదురుతిరిగి తన పంట గింజలు రక్షించడమే కాకుండా, నాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ సాయుధ పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన, గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని, ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి, బిసి సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు)