మినీ జాతర పనులు ప్రధాన జాతరకు పనికి వచ్చేలా చెయ్యాలి
మినీ మేడారం జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయండి
నూతన పనులను నాణ్యతతో చేయాలి
మిగిలిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లిస్తాం
న్యూస్ తెలుగు /ములుగు : వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, మినీ జాతర పనులు మహా జాతరకు ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శబరీష్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి రానున్న మినీ మేడారం జాతరపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ ఆయా పనులు శాశ్వతంగా ఉండకపోవడం వల్ల మరల అవే పనులు చేపట్ట వలసివస్తున్నదని ఇప్పటినుండి చేపట్టే పనులు దీర్ఘకాలంగా ఉండే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్పర్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన దృశ్య జాతరకు నిధులు వచ్చే అవకాశం ఉందని, జాతరకు విడుదలయ్యే నిధులతో గద్దెల చుట్టూ ఫ్లోరింగ్ చేయడంతో పాటు నిత్యం మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర సమయంలో కోట్లాదిమంది భక్తులు రావడమే కాకుండా సెలవు దినాల్లో సైతం వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి మేడారం చేరుకుంటున్నారని, వారికి సైతం వసతులు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉందని అన్నారు. గతంలో జాతరలో పనిచేసిన అధికారుల సూచనలు సలహాలను జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొత్త అధికారులు తీసుకోవాలని, తాను మంత్రి అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగా జాతర అదనపు నిధులు తేవడానికి కృషి చేస్తానని అన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన పక్షంలో ములుగు జిల్లాలో జిల్లా అధికారులను భక్తులు ఎన్నటికీ మర్చిపోలేరని, ములుగు జిల్లాకు డైనమిక్ కలెక్టర్ రావడం జిల్లా ప్రజల అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు.
2024 లో జరిగిన మహా జాతర సందర్భంగా చేపట్టిన పనులకు నిలిచిపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకుంటానని, మేడారంలో చేపట్టే పనులు శాశ్వతంగా ఉండే విధంగా అన్ని శాఖల అధికారులు చోరువ చూపాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు ( ఇన్చార్జి ), ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య,పీఆర్, ఆర్ అండ్ బి, ట్రైబల్ వెల్ఫేర్, ఇర్రిగేషన్, ఆర్ డబ్లు , విద్యుత్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : మినీ జాతర పనులు ప్రధాన జాతరకు పనికి వచ్చేలా చెయ్యాలి)