ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలి
ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ.నెట్ 2.0 పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ
న్యూస్ తెలుగు /ములుగు : రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 పై జిల్లాల కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి,
ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, గత వారం రోజులుగా నూతన ఓటర్ నమోదు పై చేపట్టిన ఇంటింటి సర్వే పని తీరు చాలా మెరుగుపడిందని, ఇప్పటి వరకు 90 శాతం పైగా ఇంటింటి సర్వే పూర్తయిందని, సెప్టెంబర్ 28 నాటికి 100% ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని అన్నారు.
పెండింగ్ ఉన్న ఓటర్ నమోదు సంబంధించి ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సీ.ఈ.ఓ ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారి వివరాలు నోటీసు జారీ చేసి నిర్దేశిత ప్రోసిడ్యూర్ ఫాలో అయిన తరువాత తొలగించాలని అన్నారు.
ఇంటింటి సర్వే లో ఆధార్ నెంబర్ సేకరణ తప్పనిసరి కాదని , ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చని, బలవంతం చేయరాదని అన్నారు. ఇంటింటి సర్వే సంబంధించి వచ్చిన నూతన ఓటర్ నమోదు దరఖాస్తుల వివరాలు, నూతన ఓటర్ల నమోదు సంబంధించిన అంశాలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని అన్నారు.
నూతన ఓటరు కార్డుల ముద్రణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సమర్పించాలని, పోలింగ్ కేంద్రం లోకేషన్, ఫోటోలను బి.ఎల్.ఓ యాప్ లను అప్ లోడ్ చేయాలని అన్నారు.
బి.ఎల్.ఓ యాప్ వినియోగం పై బూత్ స్థాయి అధికారులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ ప్రక్రియ డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 29 ముందు పూర్తి చేయాలని సీఈఓ అధికారులను ఆదేశించారు.
మెదక్ -నిజామాబాద్ -అదిలాబాద్ -కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్లు, ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్ల శాసనమండలి సభ్యుల నియోజకవర్గ స్థానాలకు ఎన్నిక కోసం సెప్టెంబర్ 30న , పబ్లిక్ నోటీస్ జారీ చేసి ఓటర్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలి)