ముసాయిదా పై అభ్యంతరాలు సమర్పించండి
– సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో కోరిన ఎంపీడివోలు
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ అధికారులు సూచించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్,దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజక వర్గ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారులతో కలిసి గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవోలు మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిలో జీపీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాను ప్రచురించామని తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 21లోగా పంచాయితీ కార్యదర్శులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ నెల 26 వరకు అభ్యంతరాలు పరిశీలన చేసి 28న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. (Story : ముసాయిదా పై అభ్యంతరాలు సమర్పించండి)