‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్
– సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ ని సరికొత్తగా పరిచయం చేసిన చిత్ర బృందం
– సెప్టెంబర్ 20న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి మొదటి గీతం విడుదల
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, వైభవంగా ప్రారంభ వేడుకను నిర్వహించింది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఒక తీపికబురు చెప్పారు. ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ తీపి కబురుని తెలపడమే కాకుండా, సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్’ పోస్టర్ ను చూడగానే ‘మ్యాడ్’ అభిమానులు ప్రేమలో పడిపోతారు అనడంలో సందేహం లేదు.
మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేశారు.
అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.
శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
‘మ్యాడ్’ కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
మ్యాడ్ స్క్వేర్:
తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ (Story : ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ )