తుంపర్తి భూ బాధిత రైతులకు న్యాయం చేయండి
రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ కి పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మండలం, తుంపర్తి గ్రామ రైతుల నుంచి గృహ నిర్మాణాల కోసం సేకరించిన భూములకు ఇవ్వాల్సిన పరిహారం గురించి పరిటాల శ్రీరామ్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మన వివరాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తుంపర్తి గ్రామానికి చెందిన 90మంది నిరుపేద రైతు కుటుంబాల నుంచి 210ఎకరాల భూమిని గతంలో గృహనిర్మాణాలకోసం సేకరించారన్నారు. ఒక ఎకరాకు 5లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పగా కొంతమంది పరిహారం తీసుకోగా మెజారిటీ రైతులు ఒప్పుకోకపోవడంతో వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా గృహాలను నిర్మించారన్నారు. ఈ అన్యాయంపై సంబంధిత రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా రైతులకు న్యాయం చేయమని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా.. అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధర్మవరం నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి అదే రోడ్డు మార్గంలో వెళుతుండగా రైతులు తమ సమస్యను విన్నవించుకుందామని అడ్డుకొని ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోవడంతో పాటు వారిపై కేసులు బనాయించారన్నారు. గత ఎన్నికల్లో ఆ గ్రామాల రైతులు, ప్రజలు పార్టీ నిర్ణయించిన ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ గెలుపులో చురుకుగా పనిచేశారన్నారు. మనం కూడా ఎన్నికలకు ముందు దీనిపై న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని వివరించారు. ప్రస్తుతం రైతులకు జరిగిన నష్టాన్ని గమనించి.. వారికి పరిహారాన్ని మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని రెవెన్యూశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని తెలిపారు. అనంతరం మంత్రి స్పందిస్తూ దీనిపై అన్ని అంశాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తదుపరి మరోవైపు పరిటాల శ్రీరామ్ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అంశాల గురించి శ్రీరామ్ లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. (Story : తుంపర్తి భూ బాధిత రైతులకు న్యాయం చేయండి)